జొకోవిచ్ X ఫెడరర్‌

13 Jul, 2019 04:46 IST|Sakshi

వింబుల్డన్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో సెర్బియా స్టార్‌తో స్విస్‌ దిగ్గజం ‘ఢీ’

సెమీఫైనల్స్‌లో అగుట్‌పై జొకోవిచ్, నాదల్‌పై ఫెడరర్‌ విజయం

లండన్‌: ఈ సీజన్‌లో తన అద్వితీయ ప్రదర్శన కొనసాగిస్తూ ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్‌ చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి సెమీఫైనల్లో టాప్‌ సీడ్‌ జొకోవిచ్‌ (సెర్బియా) 6–2, 4–6, 6–3, 6–2తో 23వ సీడ్‌ బాటిస్టా అగుట్‌ (స్పెయిన్‌)పై విజయం సాధించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో రెండో సీడ్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌)తో జొకోవిచ్‌ తలపడతాడు. 3 గంటల 2 నిమిషాలపాటు జరిగిన రెండో సెమీఫైనల్లో ఫెడరర్‌ 7–6 (7/3), 1–6, 6–3, 6–4తో మూడో సీడ్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌)పై గెలిచాడు. వరుసగా 21వ ఏడాది వింబుల్డన్‌ టోర్నీలో ఆడుతున్న 37 ఏళ్ల ఫెడరర్‌ 12వసారి ఫైనల్‌కు చేరాడు. 8 సార్లు టైటిల్‌ నెగ్గిన అతను మూడుసార్లు రన్నరప్‌గా నిలిచాడు.   

ఈ ఏడాది బాటిస్టా అగుట్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన జొకోవిచ్‌ మూడోసారి మాత్రం విజయాన్ని రుచి చూశాడు. 27వ ప్రయత్నంలో కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీఫైనల్‌ చేరిన అగుట్‌ ఆ అడ్డంకిని మాత్రం దాటలేకపోయాడు. 2 గంటల 49 నిమిషాలపాటు జరిగిన పోరులో జొకోవిచ్‌కు రెండో సెట్‌ మినహా అంతగా ప్రతిఘటన ఎదురుకాలేదు. మ్యాచ్‌ మొత్తంలో తొమ్మిది ఏస్‌లు సంధించిన జొకోవిచ్‌ మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. నెట్‌ వద్దకు 53 సార్లు దూసుకొచ్చిన అతను 42 సార్లు పాయింట్లు సాధించడం విశేషం.అగుట్‌ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసిన జొకోవిచ్‌ రెండో సెట్‌లో ఒకసారి తన సర్వీస్‌ను కోల్పోయాడు. 42 విన్నర్స్‌ కొట్టిన జొకోవిచ్‌ 29 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు అగుట్‌  కేవలం ఐదు ఏస్‌లు సంధించి రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. అగుట్‌పై విజయంతో జొకోవిచ్‌ తన కెరీర్‌లో 25వసారి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో టైటిల్‌ పోరుకు చేరాడు. 15 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన అతను 9సార్లు రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. వింబుల్డన్‌ ట్రోఫీని నాలుగుసార్లు (2011, 2014, 2015, 2018) సొంతం చేసుకున్న జొకోవిచ్‌ ఒకసారి (2013లో) రన్నరప్‌గా నిలిచాడు.

మరిన్ని వార్తలు