అందరికీ ఆరోగ్య‘సిరి’

13 Jul, 2019 04:57 IST|Sakshi

ఆరోగ్యశ్రీ పథకానికి బడ్జెట్‌లో రూ.1,740 కోట్లు

రూ. వెయ్యి బిల్లు దాటితే.. ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచిత వైద్యం

ఏ నగరంలోనైనా వైద్యం చేయించుకునే వెసులుబాటు

వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు ఉన్నవారికి ఉచిత వైద్యమందేలా నిర్ణయం

ఆశా వర్కర్ల గౌరవ వేతనానికి రూ.455 కోట్లు

మొత్తంగా వైద్య ఆరోగ్యశాఖకు బడ్జెట్‌లో రూ.11,398.99 కోట్లు కేటాయింపు

గతేడాదితో పోలిస్తే 35 శాతం పెరుగుదల

సాక్షి, అమరావతి: పేదవారి ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ రాష్ట్ర సర్కారు బడ్జెట్‌లో వైద్య రంగానికి పెద్దపీట వేసింది. కనీవినీ ఎరుగని రీతిలో వైద్య ఆరోగ్య శాఖకు తాజా బడ్జెట్‌లో రూ.11,398.93 కోట్లను కేటాయించింది. 2018–19 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 35 శాతం పెరుగుదల చోటు చేసుకోవడం విశేషం. అంతేగాక ప్రతి పేదవాడికీ ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో దివంగత ముఖ్యమంతివైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి పునర్‌వైభవం తీసుకొచ్చింది. ఈ పథకానికి ఏకంగా రూ.1,740 కోట్లు కేటాయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ స్థాయిలో ఎప్పుడూ కేటాయింపులు చేయకపోవడం గమనార్హం. వెయ్యి రూపాయలు బిల్లు దాటితే చాలు.. దాన్ని ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి వారికి ఉచితంగా వైద్యం అందించాలన్న బలమైన ఆశయంతో ఈ పథకానికి భారీ కేటాయింపులు చేసింది. ఇతర రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్యాన్ని గత సర్కారు ఆపేయడం తెలిసిందే.

దీనికి ముగింపు పలుకుతూ.. ఇప్పుడు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ వంటి నగరాలకూ సేవలను విస్తరించింది. గతంలో ఉద్యోగుల వైద్యపథకంలో మాత్రమే ఉన్న కొన్ని జబ్బులను ఇప్పుడు ఆరోగ్యశ్రీలోనూ చేర్చి దాదాపు రెండువేల జబ్బులకు ఉచితంగా వైద్యమందించేలా నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఉన్నవారికి సైతం ఉచిత వైద్యమందేలా నిర్ణయించింది. తద్వారా మధ్య తరగతి వారికీ సర్కారు ఆరోగ్య భరోసా కల్పించింది. ఈ ఏడాది దేశ బడ్జెట్‌ రూ.27,86,349 కోట్లు అయితే ఇందులో ఆరోగ్య రంగానికి కేటాయించింది రూ.62,659 కోట్లు. అంటే కేవలం 2.2 శాతం మాత్రమే. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ రూ.2,27,974 కోట్లు కాగా, ఇందులో ఆరోగ్యశాఖకు రూ.11,398.93 కోట్లు కేటాయించడమంటే ఆరోగ్య రంగానికి 5 శాతం కేటాయింపులు జరిపినట్టు అవుతుంది.

108, 104 బలోపేతం
వైఎస్సార్‌ హయాంలో అద్భుతంగా నడిచిన 108 అంబులెన్సులు, 104 సంచార వైద్యశాలల సేవలు ఆయన మరణానంతరం నిర్వీర్యం కావడం తెలిసిందే. ఇప్పుడు వీటికి కూడా పునర్‌వైభవం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేసింది. మండలానికొక వాహనాన్ని కేటాయించాలన్న ఉద్దేశంతో ఈ రెండు పథకాలకు 323.14 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే ఇది 80 శాతం పైనే. ఇందులో 108 వాహనాలకు రూ.143.38 కోట్లు, 104 వాహనాలకు రూ.179.76 కోట్ల నిధులు వెచ్చించనుంది. క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ఆశా వర్కర్ల గౌరవ వేతనాన్ని పెంచిన రాష్ట్ర సర్కారు వారికోసం ఈ బడ్జెట్‌లో రూ.455 కోట్లను కేటాయించింది. ఆశా వర్కర్ల వేతనాలను రూ.3 వేల నుంచి రూ.పది వేలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెంచడం తెలిసిందే.


 

గురజాలలో ప్రభుత్వ వైద్యకళాశాల
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఉన్న గురజాల నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్యకళాశాల నిర్మించేందుకు రూ.66 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటికే పాడేరులో ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ప్రస్తుతం గురజాలలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 300 పడకల ఆస్పత్రిగా ఉన్నతీకరించి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తారు. మరోవైపు విజయనగరంలో కొత్తగా ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటు చేస్తూ రూ.66 కోట్లు కేటాయించింది. మరోవైపు ఆయుష్‌ వైద్యకళాశాలల అభివృద్ధికి గతేడాది రూ.30 కోట్లు ఇస్తే ఈ ఏడాది రూ.52 కోట్లు కేటాయించారు.

బడ్జెట్‌లో ప్రధానమైన వాటికి  కేటాయింపులు ఇలా.. (రూ.కోట్లల్లో)

ఆరోగ్యశ్రీ -                   1,740
108 -                       123.09
104 -                      141.47
ఆశావర్కర్లకు -                455
ఉద్యోగుల వైద్యానికి -         200
రేడియాలజీ సర్వీసులు -      25
మందుల కొనుగోళ్లకు -      126

మరిన్ని వార్తలు