ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం

20 Nov, 2023 13:21 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం టీమిండియాకు అతి త్వరలో రానుంది. స్వదేశంలోనే మరో 3 రోజుల్లో భారత్‌, ఆసీస్‌ టీ20 సిరీస్‌ ప్రారంభంకానుంది. 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో గెలిచి ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత ఆటగాళ్లు భావిస్తున్నారు. ఈ సిరీస్‌ నవంబర్‌ 23 నుంచి ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్‌ వైజాగ్‌ వేదికగా, రెండో టీ20 నవంబర్‌ 26న (తిరువనంతపురం), మూడో మ్యాచ్‌ నవంబర్‌ 28న (గౌహతి), నాలుగు (నాగ్‌పూర్‌), ఐదు టీ20లు (హైదరాబాద్‌) డిసెంబర్‌ 1, 3 తేదీల్లో జరుగనున్నాయి.  

కాగా, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో టీమిండియా పోరాడి ఓడింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నామమాత్రపు స్కోర్‌కే (240) పరిమితమైనప్పటికీ.. బౌలింగ్‌లో రాణించి చివరి వరకు పోరాడింది. ట్రవిస్‌ హెడ్‌ (137) చిరస్మరణీయ శతకంతో ఆసీస్‌ గెలుపు అంచుల వరకు తీసుకెళ్లాడు. లబూషేన్‌ (58 నాటౌట్‌) సహకారంతో భారత్‌కు గెలుపును దూరం చేశాడు.

వీరిద్దరు నాలుగో వికెట్‌కు 192 పరుగలు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్‌ను గెలిపించారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ, సిరాజ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్‌లో రోహిత్‌ శర్మ (47), విరాట్‌ కోహ్లి (54), కేఎల్‌ రాహుల్‌ (66) ఓ మోస్తరుగా రాణించారు. ఆసీస్‌ బౌలర్లు స్టార్క్‌ (3/55), హాజిల్‌వుడ్‌ (2/60), కమిన్స్‌ (2/34), మ్యాక్స్‌వెల్‌ (1/35), జంపా (1/44) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి టీమిండియా పతనాన్ని శాశించారు. 

మరిన్ని వార్తలు