ఏషియన్‌ గేమ్స్‌: భారత్‌కు మరో స్వర్ణం

24 Aug, 2018 12:15 IST|Sakshi

జకార్తా: ఏషియన్‌ గేమ్స్‌ 2018లో భారత్‌ జోరు కొనసాగుతోంది. శుక్రవారం ఆరో రోజు ఆటలో భాగంగా భారత్‌ తన పతకాల వేటను కొనసాగిస్తోంది. టెన్నిస్‌ పురుషుల డబుల్స్‌ ఫైనల్లో భారత జోడి రోహన్‌ బోపన్న-దివిజ్‌ శరణ్‌ ద్వయం విజయం సాధించి స్వర్ణాన్ని సాధించింది. తుది పోరులో బోపన్న జంట 2-0 తేడాతో బబ్లిక్‌- డెనిస్‌‍(కజికిస్తాన్‌)జోడిపై గెలిచి పసిడితో మెరిసింది. తొలి సెట్‌ను 6-3 తేడాతో గెలిచిన బోపన్న జోడి.. రెండో సెట్‌ను 6-4తో సొంతం చేసుకుని మ్యాచ్‌తో పాటు స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది.

షూటింగ్‌లో మరో కాంస్యం

షూటింగ్‌లో భారత్‌కు మరో కాంస్య పతకం దక్కింది. ఈరోజు జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో హీనా సిద్ధు కాంస్యాన్ని సాధించారు. ఓవరాల్‌గా 198.8 స్కోరుతో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని దక్కించుకున్నారు. దాంతో భారత్‌ పతకాల సంఖ్య 23కు చేరింది. ఇందులో 6 స్వర్ణాలు, 4 రజతాలు, 13 కాంస్య పతకాలు ఉన్నాయి.

అంతకుముందు ఆరో రోజు ఆటలో పురుషుల సింగిల్‌ స్కల్స్‌ ఈవెంట్‌లో దుష్యంత్‌ చౌహాన్‌ కాంస్య పతకం సాధించి రోయింగ్‌లో తొలి పతకాన్ని అందించగా, ఆపై  డబుల్‌ స్కల్స్‌లో భారత రోయర్లు రోహిత్‌ కుమార్‌-భగవాన్‌ సింగ్‌ జోడి మరో కాంస్యాన్ని సాధించింది. కాగా, పురుషుల క్వాడ్రాపుల్‌ స్కల్స్‌  ఈవెం‍ట్‌లో భారత్‌ పసిడితో మెరిసింది. టీమ్‌ ఈవెంట్‌లో భారత రోయర్లు సవరణ్‌ సింగ్‌, దత్తు భోకనల్‌, ఓం ప‍్రకాశ్‌, సుఖ్‌మీత్‌ సింగ్‌లు స్వర్ణాన్ని సాధించారు. ఫైనల్స్‌లో వీరు 6;17;13 సెకన్లలో వేగవంతమైన టైమింగ్‌ నమోదు చేసి స‍్వర్ణాన్ని సాధించారు. ఏ దశలోనూ అలసటకు లోను కాకుండా తొలి స్థానంలో నిలిచారు. దాంతో రోయింగ్‌లో భారత్‌కు తొలి స్వర్ణం లభించింది.

మరిన్ని వార్తలు