తొలి టీమిండియా క్రికెటర్‌గా..

12 Dec, 2019 10:35 IST|Sakshi

67 సిక్సర్లతో టాప్‌ ప్లేస్‌..

ముంబై:  టీమిండియా ఓపెనర్‌, హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ మరో రికార్డును సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో నాలుగు వందల సిక్సర్ల కొట్టిన తొలి టీమిండియా క్రికెటర్‌గా నయా అధ్యాయాన్ని లిఖించాడు. ముంబైలోని వాంఖేడే స్టేడియంలో బుధవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ 34 బంతుల్లో 71 పరుగులు సాధించాడు. ఇందులో 6 ఫోర్లతో పాటు 5 సిక్సర్లు ఉన్నాయి. దాంతో ‘400’ సిక్సర్ల మార్కును రోహిత్‌ చేరుకుని అరుదైన క్లబ్‌లో చేరిపోయాడు.  అంతర్జాతీయ క్రికెట్‌లో 400 సిక్స్‌లు పూర్తి చేసుకున్న మూడో క్రికెటర్‌ రోహిత్‌ శర్మ. ఈ జాబితాలో గేల్‌ (విండీస్‌–534), షాహిద్‌ అఫ్రిది (పాక్‌–476) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.  కాగా, భారత్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ మార్కును చేరిన తొలి క్రికెటర్‌ రోహితే కావడం విశేషం. వన్డేల్లో 232 సిక్సర్లు సాధించిన రోహిత్‌,.. టెస్టుల్లో 52 సిక్సర్లు కొట్టాడు. ఇక అంతర్జాతీయ టీ20ల్లో 120 సిక్సర్లను సాధించాడు. ప్రస్తుతం రోహిత్‌ 404 అంతర్జాతీయ సిక్సర్లతో ఉన్నాడు.(ఇక్కడ చదవండి: చితగ్గొట్టి... సిరీస్‌ పట్టి...)

67 సిక్సర్లతో టాప్‌ ప్లేస్‌..
ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో సిక్సర్లలో రోహిత్‌ శర్మ దుమ్ములేపాడు. 2019లో ఇప్పటివరకూ రోహిత్‌ 67 సిక్సర్లను సాధించాడు. ఫలితంగా ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక అంతర్జాతీయ సిక్సర్లు సాధించిన జాబితాలో రోహిత్‌ టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. 2017లో 65 సిక్సర్లతో టాప్‌ ప్లేస్‌ను సాధించిన రోహిత్‌.. 2018లో 74 సిక్సర్లతో తన ‘హిట్‌ మ్యాన్‌’ రికార్డును నిలబెట్టుకున్నాడు. గతేడాది సాధించిన అత్యధిక సిక్సర్లను రోహిత్‌ ఈ ఏడాది కూడా సాధించాలంటే ఇంకా 7 సిక్సర్లు అవసరం. ఇంకా ఈ ఏడాది భారత్‌ ఆడాల్సిన మ్యాచ్‌లో మూడు ఉండటంతో రోహిత్‌ దాన్ని దాటేసే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు