రోహిత్‌ రాయుడు సెంచరీ

7 Feb, 2018 01:27 IST|Sakshi
రోహిత్‌ రాయుడు

జార్ఖండ్‌పై హైదరాబాద్‌ గెలుపు

సాక్షి, హైదరాబాద్‌: సొంతగడ్డపై హైదరాబాద్‌ క్రికెట్‌ జట్టు అదరగొట్టే ప్రదర్శనతో ఆకట్టుకుంది. విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా గ్రూప్‌ ‘డి’లో రెండో విజయం సాధించింది. జార్ఖండ్‌తో మంగళవారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 66 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 333 పరుగులు చేసింది. ఓపెనర్‌ రోహిత్‌ రాయుడు (135 బంతుల్లో 126; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుత సెంచరీ చేయగా... కెప్టెన్‌ అక్షత్‌ రెడ్డి (73 బంతుల్లో 75; 8 ఫోర్లు, ఒక సిక్స్‌), బావనాక సందీప్‌ (45 బంతుల్లో 69; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. తొలి వికెట్‌కు అక్షత్‌తో 139 పరుగులు జోడించిన రోహిత్‌... రెండో వికెట్‌కు సందీప్‌తో 106 పరుగులు జత చేశాడు. జార్ఖండ్‌ బౌలర్లలో రాహుల్‌ శుక్లా రెండు వికెట్లు పడగొట్టగా... వరుణ్‌ ఆరోన్, వికాశ్, షాబాజ్‌ నదీమ్, విరాట్‌ సింగ్‌ ఒక్కో వికెట్‌ తీశారు.  334 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జార్ఖండ్‌ 46.5 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది. అతుల్‌ సింగ్‌ (58 నాటౌట్‌; 7 ఫోర్లు), ఇషాన్‌ కిషన్‌ (51; 4 ఫోర్లు, ఒక సిక్స్‌), సౌరభ్‌ తివారి (49; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. హైదరాబాద్‌ బౌలర్లలో రవికిరణ్‌ (2/41), సిరాజ్‌ (2/51), మెహదీ హసన్‌ (2/65) రాణించారు.

గిరినాథ్‌కు ఆరు వికెట్లు... 
ఇదే టోర్నీలో భాగంగా చెన్నైలో గ్రూప్‌ ‘సి’ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఆరు వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్‌ను ఓడించి వరుసగా రెండో విజయం నమోదు చేసింది. గిరినాథ్‌ రెడ్డి (6/24) అద్భుత బౌలింగ్‌తో విజృంభించి ఆరు వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన మధ్యప్రదేశ్‌ 44.2 ఓవర్లలో 184 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఆంధ్ర జట్టు 38.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసి విజయాన్నందుకుంది. అశ్విన్‌ హెబర్‌ (42; 5 ఫోర్లు), కెప్టెన్‌ హనుమ విహారి (61; 9 ఫోర్లు) రెండో వికెట్‌కు 103 పరుగులు జతచేశారు. వీరిద్దరు అవుటయ్యాక రికీ భుయ్‌ (32 నాటౌట్‌; 4 ఫోర్లు, ఒక సిక్స్‌), డీవీ రవితేజ (33 నాటౌట్‌; 5 ఫోర్లు) జాగ్రత్తగా ఆడి ఆంధ్ర విజయాన్ని ఖాయం చేశారు.    

మరిన్ని వార్తలు