CWC 2023 IND Vs SA Highlights: భారత్‌ ప్రతాపం.. దక్షిణాఫ్రికా దాసోహం 

6 Nov, 2023 02:35 IST|Sakshi

కోహ్లి శతకం... జడేజా మాయాజాలం

243 పరుగులతో భారత్‌ బ్రహ్మాండ విజయం 

రోహిత్‌ జట్టుకు వరుసగా ఎనిమిదో గెలుపు

49వ సెంచరీతో సచిన్‌ రికార్డును సమం చేసిన కోహ్లి

ఐదు వికెట్లతో మెరిసిన జడేజా 

ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌ కష్టపెట్టింది. ఆరంభంలో రో‘హిట్స్‌’తో పరుగులు సులువైనా... తర్వాత గగనమైంది. ‘రన్‌ మెషిన్‌’  విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌ కనిపెట్టుకొని పరుగులు పేర్చితే జట్టు స్కోరు 300 మార్కు దాటింది. ‘బర్త్‌డే బాయ్‌’ విరాట్‌ సెంచరీ పర్వాన్ని చూపిస్తే... ఆ తర్వాత బౌలర్లు వికెట్ల కూల్చివేతల్లో త్వరపడ్డారు. దీంతో వార్‌ వన్‌సైడ్‌ అయిన ఈ మ్యాచ్‌లో భారత్‌ ఘనవిజయాన్ని నమోదు చేసుకుంది. ఈ టోర్నీలో వరుసగా ఎనిమిదో విజయంతో రోహిత్‌ శర్మ బృందం మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 16 పాయింట్లతో ‘టాప్‌ ర్యాంక్‌’ను ఖరారు చేసుకుంది.  

కోల్‌కతా: అదేంటో ఈ ప్రపంచకప్‌లో యుద్ధం తప్పదనుకున్న మ్యాచ్‌ల్లోనే భారత్‌ సులువుగా దండయాత్ర చేసి గెలుస్తోంది. ఆ్రస్టేలియాతో మొదలైన టీమిండియా తొలి మ్యాచ్, క్రికెట్‌ ప్రపంచం గుడ్లప్పగించి చూసిన పాక్‌తో సమరం... భారీస్కోర్లతో చేలరేగుతున్న దక్షిణాఫ్రికాతో తాజా పోరు... ఇవన్నీ కూడా పోటాపోటీగా సాగుతాయనుకుంటే భారత్‌ వీరంగంతో ఏకపక్షమయ్యాయి. దీంతో ఆతిథ్య జట్టు కాస్తా అజేయ శక్తిగా మారిపోయింది.

ఈ ప్రపంచకప్‌లో భారత జట్టు తర్వాత జోరుమీదున్న దక్షిణాఫ్రికా టీమిండియా దూకుడుకు దాసోహమైంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన భారత్‌ 243 పరుగులతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి పాయింట్ల పట్టికలో 16 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఖరారు చేసుకుంది. కోహ్లి పుట్టినరోజు (నవంబర్‌ 5) ఉదయం శుభాకాంక్షలతో మొదలైతే... సాయంత్రం వచ్చేసరికి శతక ప్రదర్శనతో ప్రశంసలు వెల్లువెత్తాయి. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగుల భారీస్కోరు చేసింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ విరాట్‌ కోహ్లి (121 బంతుల్లో 101 నాటౌట్‌; 10 ఫోర్లు) సచిన్‌కు సరిసమానమైన 49వ వన్డే సెంచరీ సాధించి అజేయంగా నిలిచాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (87 బంతుల్లో 77; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో 83 పరుగులకే కుప్పకూలింది. జాన్సెన్‌ (14) టాప్‌స్కోరర్‌! రవీంద్ర జడేజా (5/33) తన స్పిన్‌తో దక్షిణాఫ్రికాను చుట్టేశాడు. కుల్దీప్‌ యాదవ్, షమీ చెరో 2 వికెట్లు తీశారు. భారత్‌ తమ చివరి లీగ్‌ మ్యాచ్‌ను ఈనెల 12న బెంగళూరులో నెదర్లాండ్స్‌ జట్టుతో ఆడుతుంది.  

రో‘హిట్స్‌’తో మొదలై... 
కెప్టెన్ , హిట్‌మ్యాన్‌ రోహిత్‌ (24 బంతుల్లో 40; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఎదురుదాడికి దిగడంతో స్కోరు సగటున 10 పరుగుల రన్‌రేట్‌తో దూసుకెళ్లింది. 6వ ఓవర్లోనే రబడ అతని వేగానికి కళ్లెం వేయగా... కోహ్లి, శుబ్‌మన్‌ గిల్‌ (24 బంతుల్లో 23; 4 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగానే ఆడటంతో 10 ఓవర్లలో భారత్‌ 91/1 స్కోరు చేసింది.

కేశవ్‌ మహరాజ్‌ బౌలింగ్‌కు దిగగానే పరిస్థితి ఒక్కసారిగా ‘స్విచ్చాఫ్‌’ చేసినట్లు మారింది. గిల్‌ను అవుట్‌ చేసి... సహకరించే పిచ్‌పై స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ కట్టడి చేయడంతో తర్వాతి 16 ఓవర్లలో భారత్‌ 60 పరుగులే చేయగలిగింది. 26 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 151/1 స్కోరుతో వేగంలో వెనుకబడింది. 

‘శత’క్కొట్టిన కోహ్లి 
పిచ్‌ సంగతి అర్థమైన కోహ్లి... కేశవ్‌ బౌలింగ్‌ ప్రమాదకరమని గుర్తించాడు. అవతలివైపు అయ్యర్‌నూ అలర్ట్‌ చేసి సింగిల్స్, డబుల్స్‌తోనే స్కోరును ముందుకు సాగనిచ్చాడు. కానీ షమ్సీని మాత్రం వదల్లేదు. చక్కగా బౌండరీలు బాదారు. కోహ్లి 67 బంతుల్లో, అయ్యర్‌ 64 బంతుల్లో ఫిఫ్టీలు సాధించారు.

ఈ జోడి మూడో వికెట్‌కు 134 పరుగులు జతచేశాక అయ్యర్‌ ఆటను ఎన్‌గిడి ముగించాడు. రాహుల్‌ (8) వచ్చివెళ్లాడు. ఆఖరి దశలో సూర్యకుమార్‌ (14 బంతుల్లో 22; 5 ఫోర్లు) జోరును షమ్సీ అడ్డుకోగా... జడేజా (15 బంతుల్లో 29 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) వచ్చాకే భారత్‌ పుంజుకొని 300 దాటింది. కోహ్లి (119 బంతుల్లో) శతకం సాధించాడు. ఈ మేటి బ్యాటర్‌  క్రీజులో ఉన్నా కూడా... కేశవ్‌ పూర్తి కోటా వేసినా... ఒక్క బౌండరీ ఇవ్వకపోవడం విశేషం. 

సఫారీ పేకమేడలా... 
ఈ టోర్నీలోనే బాగా సెంచరీలు, భారీగా స్కోర్లు చేస్తున్న జట్టు... రన్‌రేట్‌లో ముందున్న జట్టు దక్షిణాఫ్రికానే! కానీ ఈ జట్టు కూడా భారత బౌలింగ్‌కు కుదేలైంది. ఇంకా చెప్పాలంటే వికెట్లు రాలిన ఉదంతాన్ని చూస్తే ఓ క్రికెట్‌ కూననే తలపించింది. సిరాజ్‌ డెలివరీకి డికాక్‌ (5) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.

జడేజా ముందుగానే రంగంలోకి దించితే తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా క్రమం తప్పకుండా సఫారీ మేటి బ్యాటర్లను పడగొట్టేశాడు. బవుమా (11), క్లాసెన్‌ (1), మిల్లర్‌ (11)లను స్పిన్‌ ఉచ్చులో ఉక్కిరి బిక్కిరి చేయగా... మరోవైపు షమీ పేస్‌తో డసెన్‌ (13), మార్క్‌రమ్‌ (9)లను పెవిలియన్‌ చేర్చాడు. కుల్దీప్‌ కూడా తనవంతు మ్యాజిక్‌ చూపడంతో 40 పరుగులకే 5 వికెట్లను... 83 పరుగులకే దక్షిణాఫ్రికా మొత్తం వికెట్లను కోల్పోయి ఆలౌటైంది.  

స్కోరు వివరాలు 
భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (సి) బవుమా (బి) రబడ 40; గిల్‌ (బి) కేశవ్‌ 23; కోహ్లి (నాటౌట్‌) 101; అయ్యర్‌ (సి) మార్క్‌రమ్‌ (బి) ఎన్‌గిడి 77; రాహుల్‌ (సి) డసెన్‌ (బి) జాన్సెన్‌ 8; సూర్యకుమార్‌ (సి) డికాక్‌ (బి) షమ్సీ 22; జడేజా (నాటౌట్‌) 29; ఎక్స్‌ట్రాలు 26; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 326. వికెట్ల పతనం: 1–62, 2–93, 3–227, 4–249, 5–285. బౌలింగ్‌: ఎన్‌గిడి 8.2–0–63–1, జాన్సెన్‌ 9.4–0–94–1, రబడ 10–1–48–1, కేశవ్‌ మహరాజ్‌ 10–0–30–1, షమ్సీ 10–0–72–1, మార్క్‌రమ్‌ 2–0–17–0. 

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: డికాక్‌ (బి) సిరాజ్‌ 5; బవుమా (బి) జడేజా 11; డసెన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) షమీ 13; మార్క్‌రమ్‌ (సి) రాహుల్‌ (బి) షమీ 9; క్లాసెన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 1; మిల్లర్‌ (బి) జడేజా 11; జాన్సెన్‌ (సి) జడేజా (బి) కుల్దీప్‌ 14; కేశవ్‌ (బి) జడేజా 7; రబడ (సి అండ్‌ బి) జడేజా 6; ఎన్‌గిడి (బి) కుల్దీప్‌ 0; షమ్సీ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (27.1 ఓవర్లలో ఆలౌట్‌) 83. వికెట్ల పతనం: 1–6, 2–22, 3–35, 4–40, 5–40, 6–59, 7–67, 8–79, 9–79, 10–83. బౌలింగ్‌: బుమ్రా 5–0–14–0, సిరాజ్‌ 4–1–11–1, జడేజా 9–1–33–5, షమ్సీ 4–0–18–2, కుల్దీప్‌ 5.1–1–7–2.  

ప్రపంచకప్‌లో నేడు
శ్రీలంక Xబంగ్లాదేశ్‌
వేదిక: న్యూఢిల్లీ 
మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం

మరిన్ని వార్తలు