బాగుందయ్యా రోహిత్‌..!

13 Apr, 2019 17:06 IST|Sakshi

ముంబై: ఐపీఎల్‌లో భాగంగా ఇక్కడ వాంఖేడే స్టేడియంలో రాజస్తాన్‌ రాయల్స్‌ జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఔట్‌ను తప్పించుకునేందుకు విన్నూత్న పద్ధతిని అవలంభించాడు. రోహిత్‌ శర్మ స్టంపింగ్‌ కావడం ఖాయమనుకునే క్రమంలో ఆ బంతిని ఫ్రంట్‌ లెగ్‌తో తన్నేసి మరీ ఔట్‌ను తప్పించుకున్నాడు. ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌లో భాగంగా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ.. కృష్ణప్ప గౌతమ్‌ వేసిన 10వ ఓవర్‌ ఐదో బంతిని కాలితో అడ్డుకున్నాడు. ఆ బంతిని ముందుకొచ్చి(ఫ్రంట్‌ ఫుట్‌) ఆడటానికి రోహిత్‌ సిద్ధం కాగా, దాన్ని గమనించిన గౌతమ్‌ లెగ్‌ సైడ్‌ వేశాడు. అయితే రోహిత్‌ ఇక్కడ చాలా తెలివిగా వ్యవహరించాడు.

ఆ బంతిని వికెట్‌ కీపర్‌ చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు ప్యాడ్లతోనే బయటకు తన్నేశాడు. దాంతో రోహిత్‌ స్టంపింగ్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రోహిత్‌ ఇలా ఆడటం రాజస్తాన్‌ ఆటగాళ్లలో నవ్వులు పూయించింది. తాను చేసిన పనికి రోహిత్‌ కూడా విపరీతంగా నవ్వుకున్నాడు. ఇక బాగుందయ్యా రోహిత్‌ అనుకోవడం అభిమానుల వంతైంది. కాగా, జోఫ్రా ఆర్చర్‌ వేసిన 11వ ఓవర్‌ ఐదో బంతికి భారీ షాట్‌క యత్నించిన రోహిత్‌.. బట్లర్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.ముంబై ఇండియన్స్‌ స్కోరు 96 పరుగుల వద్ద ఉండగా రోహిత్‌(47) తొలి వికెట్‌గా ఔటయ్యాడు.

Liveblog

>
మరిన్ని వార్తలు