మా చెత్త ఆటనే నిష్క్రమణకు కారణం : రోహిత్‌

12 Jul, 2019 09:37 IST|Sakshi
రోహిత్‌ శర్మ

మాంచెస్టర్‌ : ప్రపంచకప్‌లో తమ పోరాటం సెమీస్‌లోనే ముగియడంపై టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఆరంభంలోని తమ చెత్త ఆటనే ప్రపంచకప్‌ నిష్క్రమణకు కారణమైందని అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత్‌ 18 పరుగుల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై రోహిత్‌ శర్మ ట్విటర్‌ వేదికగా స్పందించాడు. ‘కీలక సమయంలో జట్టుగా విఫలమయ్యాం. 30 నిమిషాల మా చెత్త ఆట.. ప్రపంచకప్‌ గెలిచే అవకాశాలను దూరం చేసింది. ఈ ఫలితంతో నా గుండె భారమైంది. మీకు కూడా అలానే ఉంటుంది. కానీ దేశం బయట అభిమానుల మద్దతు వెలకట్టలేనిది. యూకేలో మేం ఎక్కడ ఆడినా అక్కడకు వచ్చి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.’ అని రోహిత్‌ ట్వీట్‌ చేశాడు.

ఇక ఈ ప్రపంచకప్‌లో 5 సెంచరీలతో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన రోహిత్‌ శర్మ.. కీలక సెమీస్‌ పోరులో మాత్రం ఒకటే పరుగు చేసి ఔటయ్యాడు. రోహిత్‌తో పాటు కోహ్లి, రాహుల్‌లు కూడా ఒక పరుగుకే నిష్క్రమించడం భారత బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపింది.

  

మరిన్ని వార్తలు