‘అతని వల్లే సచిన్‌ బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు’

22 Jun, 2020 12:24 IST|Sakshi

న్యూఢిల్లీ: సచిన్‌ టెండూల్కర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలు సాధించిన  తొలి బ్యాట్స్‌మన్‌. సచిన్‌ పేరిట ఇప్పటికీ పలు రికార్డులు పదిలంగా ఉన్నాయంటే అతని క్రికెట్‌ను ఎంతగానో ఆస్వాదించాడో తెలుస్తోంది. తాను ఓపెనర్‌గా దిగుతానని బ్రతిమాలుకున్న సందర్భాలే కాకుండా ఆ స్థానానికి సచిన్‌ ఎంతగా వన్నె తెచ్చాడో క్రికెట్‌ అభిమానులకు సుపరిచితమే. కాగా, సచిన వరల్డ్‌ బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా ఎదగడానికి ఒక మాజీ కెప్టెన్‌ ప్రోత్సాహం ఉందట. అతను ఎవరో కాదు అగ్రెసివ్‌ బ్యాట్స్‌మన్‌గా మన్ననలు అందుకున్న కృష్ణమాచారి శ్రీకాంత్‌.  సచిన్‌ ఎదగడంలో శ్రీకాంత్‌ పాత్ర మరువలేనిదని మాజీ లెగ్‌ స్పిన్నర్‌ శివరామకృష్ణన్‌ తాజాగా పేర్కొన్నాడు. స్టార్‌ స్పోర్ట్స్‌ నిర్వహించిన తమిళ క్రికెట్‌ కనెక్టెడ్‌ షోలో శివరామకృష్ణన్‌ పలు విషయాల్ని పంచుకున్నాడు. (అవన్నీ పొరపాట్లే, చింతిస్తున్నా: స్టీవ్‌ బక్నర్‌)

‘చీకా(కృష్ణమాచారి శ్రీకాంత్‌) అగ్రెసివ్‌ బ్యాట్స్‌మనే కాదు.. అగ్రెసివ్‌ కెప్టెన్‌ కూడా. ఫలితాలు సాధించడం ద్వారానే చీకా ఏమిటో నిరూపించుకున్నాడు. అతను చాలా చురకైన వాడు.  సచిన్‌ టెండూల్కర్‌ లాంటి ఆటగాడు చీకా కెప్టెన్సీలో అరంగేట్రం చేశాడు. సచిన్‌ను చీకా బాగా ప్రోత్సహించాడు. చీకా ఇచ్చిన సహకారంతోనే అప్పుడు యుక్త వయసులో ఉన్న సచిన్‌లో ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. అది అతన్ని వరల్డ్‌ బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా నిలబెట్టింది. మనం చాలా మంది స్ఫూర్తిదాయకమైన కెప్టెన్లను చూశాం. అందులో చీకా ఒకడు. అతను సుదీర్ఘ కాలం భారత క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా చేస్తాడనుకున్నా అది జరగలేదు. నాకు చీకా కెప్టెన్సీ అంటే ఇష్టం. చాలా తక్కువ సమయం మాత్రమే చీకా కెప్టెన్‌గా ఉండటం నన్ను తీవ్ర నిరాశకు గురి చేసింది’ అని శివరామకృష్ణన్‌ తెలిపాడు. కేవలం 4 టెస్టులు, 13 వన్డేలకు మాత్రమే కృష్ణమాచారి శ్రీకాంత్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతిని శివరామకృష్ణన్‌ పరోక్షంగా ప్రస్తావించాడు. ఇక తన కెరీర్‌ కూడా తొందరగా ముగిసిపోవడంపై శివరామకృష్ణన్‌ పెదవి విప్పాడు. తనకు అంతర్జాతీయ క్రికెట్‌లో తక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించినా మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిదన్నాడు.  గావస్కర్‌ మార్గనిర్దేశంలో గైడెన్స్‌ తనకు ఎంతగానో ఉపయోగిపడిందన్నాడు. భారత్‌ తరఫున శివరామకృష్ణన్‌ 9 టెస్టులు, 16 వన్డేలను మాత్రమే ఆడాడు. 

మరిన్ని వార్తలు