‘వక్కలు అమ్మి సున్నం పెట్టేశాడు’..!

23 Nov, 2018 01:44 IST|Sakshi

స్మగ్లింగ్‌ చేసిన సనత్‌ జయసూర్య

నాసిరకం వక్కల అక్రమ రవాణా 

మాజీ క్రికెటర్‌పై తీవ్ర ఆరోపణలు

నాగపూర్‌: సనత్‌ జయసూర్య పేరు వింటే చాలు క్రికెట్‌ అభిమానులందరికీ అతని వీర విధ్వంసక బ్యాటింగ్‌ విన్యాసాలు గుర్తుకొస్తాయి. వన్డే క్రికెట్‌ రాత మార్చిన వారిలో ఒకడిగా అతని స్థానం ప్రత్యేకం. అయితే రిటైర్మెంట్‌ తర్వాత సెలక్టర్‌గా, రాజకీయ నాయకుడిగా పలు వివాదాల్లో భాగంగా నిలిచిన జయసూర్య ఇప్పుడు తీవ్ర ఆరోపణల్లో చిక్కుకున్నాడు. శ్రీలంక నుంచి భారత్‌కు అక్రమంగా వక్కలను తరలించాడని అతనిపై పోలీసులు స్మగ్లింగ్‌ కేసు నమోదు చేశారు. ఇందులో జయసూర్యతో పాటు మరో ఇద్దరు లంక క్రికెటర్లు కూడా భాగస్వాములుగా ఉన్నారు. నాగపూర్‌ కేంద్రంగా జరుగుతున్న నకిలీ, నాసిరకం వక్కల తయారీపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు ఇటీవల తనిఖీలు జరిపారు.

ఇందులో భారీ ఎత్తున నాసిరకం వక్కలను స్వాధీన పర్చుకోగా, విచారణలో జయసూర్య పేరు బయటకు వచ్చింది. రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ టీమ్‌ అతడిని ఇప్పటికే ప్రశ్నించినట్లు సమాచారం. దీనిపై భారత అధికారుల నుంచి అందిన లేఖ మేరకు శ్రీలంక ప్రభుత్వం తదుపరి విచారణ కూడా జరపనుంది.  మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలపై జయసూర్య వివరణ ఇచ్చాడు. ‘ఆ వార్త పచ్చి అబద్ధం. వక్కలకు సంబంధించిన ఎలాంటి వ్యాపారమూ నేను చేయలేదు. పత్రికలో వచ్చిన కథనాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నా. పరువుకు నష్టం కలిగించే తప్పుడు వార్తలు ప్రచురించినవారిపై నా న్యాయవాదులు తగిన చర్యలు తీసుకునే పనిలో ఉన్నారు’ అని జయసూర్య ట్వీట్‌ చేశాడు.   

మరిన్ని వార్తలు