రెండుసార్లు మోకాలి సర్జరీ చాలా కష్టం: రైనా

11 Aug, 2019 11:16 IST|Sakshi

అమస్టర్‌డామ్‌: టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా మోకాలికి సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్న ఈ సీనియర్ హిట్టర్‌కి తాజాగా నెదర్లాండ్స్‌లోని అమస్టర్‌డామ్‌లో శస్త్ర చికిత్స చేశారు. గత కొంతకాలంగా మోకాలి నొప్పితోనే దేశవాళీ మ్యాచ్‌లు ఆడుతున్న రైనా ఎట్టకేలకు సర్జరీ చేయించుకున్నాడు. దాంతో కనీసం నాలుగు నుంచి ఆరు వారాలపాటు రైనా క్రికెట్‌కు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. అయితే 2007లో తొలిసారి రైనా మోకాలి శస్త్ర చికిత్స జరిగింది. రెండోసారి మోకాలికి శస్త్ర చికిత్స జరగడం అంటే చాలా కష్టంగా ఉంటుందని రైనా పేర్కొన్నాడు.

ఈ మేరకు ఓ ప్రకటనలో తన మోకాలికి సర్జరీ జరిగిన విషయాన్ని పేర్కొన్న రైనా..  తాను తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్న స్నేహితులకు, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశాడు. ముఖ్యంగా తన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించిన డాక్టర్లు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. ‘ నా మోకాలికి సమస్య అనేది 2007లోనే మొదలైంది. అప్పట్లోనే నేను నా మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకుని బరిలోకి దిగా. మోకాలికి శస్త్ర చికిత్స జరిగినా నా వంద శాతం ఆటను ఇచ్చానంటే ఆ ఘనత డాక్టర్లు, ట్రైనర్స్‌దే.  రెండోసారి మోకాలికి సర్జరీ చేయించుకోవడం చాలా కష్టంగా అనిపిస్తోంది. చాలా నెలల నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్నా, కొన్ని వారాల నుంచి మాత్రం విపరీతమైన మోకాలి నొప్పితో సతమతమవుతున్నా. దీనికి సర్జరి ఒకటే మార్గమని భావించి అందుకు ముందుకెళ్లా. త్వరలోనే కోలుకుని మళ్లీ క్రికెట్‌ ఫీల్డ్‌లో అడుగుపెడతానని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు