తొలి భారత క్రికెటర్‌గా కొత్త చరిత్ర

10 Feb, 2018 20:02 IST|Sakshi
సెంచరీ సాధించి తర్వాత ధావన్‌ అభివాదం

జోహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికాతో నాల్గో వన్డేలో భారత ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ అరుదైన రికార్డు నెలకొల్పాడు. తన కెరీర్‌లో వందో వన్డే మ్యాచ్‌ ఆడుతున్న ధావన్‌ సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా వందో వన్డేలో సెంచరీ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. సఫారీలతో నాల్గో వన్డేలో 99 బంతుల్లో శతకం సాధించిన తర్వాత కొత్త అధ్యాయాన్ని లిఖించాడు.

వందో వన్డేలో మూడంకెల వ్యక్తిగత స్కోరును నమోదు చేసిన ఓవరాల్‌ క్రికెటర్లలో ధావన్‌ తొమ్మిదో స్థానంలో నిలిచాడు.  అంతకుముందు గ్రీనిడ్జ్‌, కెయిన్స్‌, మొహ్మద్‌ యూసఫ్‌, క్రిస్‌ గేల్‌, సంగక్కరా, ట్రెస్కోథిక్‌, శర్వాన్‌, వార్నర్‌లు వందో వన్డేలో శతకం సాధించిన ఆటగాళ్లు.

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఆరు వన్డేల సిరీస్‌లో ధావన్‌ తన జోరును కొనసాగిస్తున్నాడు. తొలి వన్డేలో 35 పరుగులు చేసి రనౌట్‌గా పెవిలియన్‌ చేరిన ధావన్‌.. ఆపై వరుస రెండు వన్డేల్లో 51 నాటౌట్‌, 76 పరుగులు సాధించాడు. తాజా మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీని సెంచరీగా మలుచుకున్నాడు ధావన్‌. ఇది ధావన్‌కు 13వ సెంచరీ. తద్వారా అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 13 వన్డే సెంచరీలు సాధించిన రెండో భారత ఆటగాడిగా ధావన్‌ నిలిచాడు. వందో మ్యాచ్‌ ఆడుతున్న ధావన్‌ 99 ఇన్నింగ్స్‌ల్లో 13 శతకాలు సాధించాడు. కోహ్లి 86 ఇన్నింగ్స్‌ల్లో 13 సెంచరీలు చేసి భారత్‌ తరపున తొలి స్థానంలో ఉన్నాడు.

మరిన్ని వార్తలు