ఏ 'మను' వర్ణించను!

6 Mar, 2018 00:28 IST|Sakshi
మను భాకర్‌

 ప్రపంచ కప్‌లో 16 ఏళ్ల భారత షూటర్‌ మను భాకర్‌కు స్వర్ణం  

 రవికుమార్‌కు కాంస్యం

గ్వాడలహారా (మెక్సికో): ప్రపంచ కప్‌ షూటింగ్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్‌ పోరు... భారత్‌కు చెందిన 16 ఏళ్ల మను భాకర్‌ ఒకవైపు... సొంతగడ్డపై ఆడుతున్న 32 ఏళ్ల సీనియర్‌ అలెజాండ్రా జవాలా మరోవైపు... ఇద్దరి గత రికార్డు చూస్తే అసలు జవాలాకు మనూ పోటీనే కాదు. ఇంత పెద్ద టోర్నీలో తొలిసారి భారత షూటర్‌ బరిలోకి దిగితే, ఇప్పటికే రెండు ప్రపంచ కప్‌లలో స్వర్ణాలు గెలిచి, రియో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన ఘనత జవాలా సొంతం! 24 షాట్‌ల ఫైనల్లో 23 షాట్‌లు ముగిసేసరికి 1.3 పాయింట్‌ ముందంజలో ఉన్న మెక్సికో క్రీడాకారిణి దాదాపు విజయాన్ని ఖాయం చేసుకుంది. అయితే ఆఖరి షాట్‌లో తీవ్రమైన ఒత్తిడిని అధిగమించి మను 10.6 స్కోరు సాధిస్తే... జవాలా తడబడి 8.8 పాయింట్లకే పరిమితమైంది. ఫలితంగా ప్రపంచ కప్‌ షూటింగ్‌లో స్వర్ణం సాధించిన అతి పిన్న వయస్కురాలిగా మను భాకర్‌ నిలిచింది. మొత్తం 237.5 పాయింట్లతో ఆమె అగ్రస్థానం సాధించగా... జవాలా (237.1 పాయింట్లు) రజతం, సెలిన్‌ గోబర్‌విలే (ఫ్రాన్స్‌–217 పాయింట్లు) కాంస్యం గెల్చుకున్నారు. ఇదే విభాగంలో భారత్‌కే చెందిన యశస్విని సింగ్‌ (196.1 పాయింట్లు) నాలుగో స్థానంలో నిలిచింది.  

పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో భారత షూటర్‌ రవికుమార్‌ కాంస్య పతకం సాధించాడు. ప్రపంచకప్‌లో అతనికి ఇదే తొలి పతకం కావడం విశేషం. ఈ పోటీలో రవికుమార్‌ 226.4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ప్రపంచ నంబర్‌వన్‌ ఇస్త్‌వాన్‌ పెనీ (హంగేరీ– 249.5 పాయింట్లు) స్వర్ణం సాధించగా, అలెగ్జాండర్‌ షిర్ల్‌ (ఆస్ట్రియా–248.7 పాయింట్లు) రజత పతకం గెలుచుకున్నాడు. భారత్‌కు చెందిన దీపక్‌ కుమార్‌ నాలుగో స్థానంలో నిలిచి నిరాశగా వెనుదిరిగాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో జరిగిన నాలుగు ఈవెంట్స్‌లోనూ భారత్‌కు పతకాలు రావడం విశేషం.  

ఆరేళ్ల వయసులో బాక్సింగ్‌ సాధన, ఆరు నెలలు తిరిగే సరికి హరియాణా సబ్‌ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం... స్కేటింగ్‌లో రాష్ట్ర చాంపియన్, అథ్లెటిక్స్‌లోనూ పతకాలు... టాంగ్‌ టా మణిపూర్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో జాతీయ స్థాయిలో స్వర్ణం, ఆపై కరాటేలో కూడా మరో పతకం... ఇంతే కాదు, క్రికెట్, కబడ్డీ, టెన్నిస్, స్విమ్మింగ్‌... ఒక్కటేమిటి ఆ అమ్మాయి ఆడని ఆట లేదు. 16 ఏళ్ల వయసుకే మను భాకర్‌ స్పోర్ట్స్‌ రికార్డు ఇది.   షూటింగ్‌ను ప్రారంభించింది ఏప్రిల్‌ 2016లో... జూన్‌ 2017కు వచ్చేసరికి జూనియర్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో పోటీల బరిలో... ఏడాది కూడా కాక ముందే సీనియర్‌ ప్రపంచకప్‌లో స్వర్ణ పతకం... మను అనూహ్య ప్రస్థానమిది. మెరైన్‌ ఇంజినీర్‌ అయిన తండ్రి ప్రోత్సాహంతో అన్ని ఆటలు ఆడేసి సత్తా చాటిన ఈ అమ్మాయి ఇప్పుడు షూటింగ్‌లో అంతర్జాతీయ యవనికపై మెరిసి శిఖరాన నిలిచింది.   హరియాణాలోని ఝజ్జర్‌ జిల్లా గోరియా గ్రామం మను స్వస్థలం. వేర్వేరు ఆటల్లో సత్తా చాటుతూ పోయిన ఈ అమ్మాయి బాక్సింగ్‌ ఆడే సమయంలో కంటికి స్వల్ప గాయమైంది. దాంతో ఆందోళన చెందిన ఆమె తల్లి ఇలాంటి ప్రమాదకరమైన ఆటలు ఇక చాలు అని గట్టిగా చెప్పడంతో షూటింగ్‌ వైపు మళ్లింది. ఝజ్జర్‌లోని యూనివర్సల్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్‌లో ఆమె షూటింగ్‌లో శిక్షణ పొందింది. సహజ ప్రతిభ, ఎక్కడ అడుగు పెట్టినా గెలవాలనే పట్టుదల వెరసి మను ఒక్కసారిగా దూసుకుపోయింది.

2017 సంవత్సరం మను కెరీర్‌కు సంబంధించి తొలి ఏడాది మాత్రమే. అయితేనేం ఆమె అన్ని విధాలా తన ముద్ర చూపించింది. జాతీయ స్థాయి జూనియర్‌ అండ్‌ యూత్‌ కేటగిరిలో తొలి స్వర్ణంతో ఆమె ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత జపాన్‌లో జరిగిన ఆసియా ఎయిర్‌గన్‌ చాంపియన్‌ షిప్‌లో రజతం సాధించింది. ఇక డిసెంబర్‌లో జరిగిన సీనియర్‌ నేషనల్స్‌లోనైతే వరుసగా రికార్డులు బద్దలు కొట్టి పతకాల వెల్లువతో సంచలనం సృష్టించింది. గత నెలలో జరిగిన ‘ఖేలో ఇండియా’ పోటీల్లో రెండు జూనియర్‌ జాతీయ రికార్డులు బద్దలు కొట్టిన మను... కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొనే 27 మంది సభ్యుల భారత జట్టులోకి ఎంపికైంది. ఇప్పుడు తాజా ప్రదర్శన ఆమె స్థాయిని మరింత పెంచింది.  ‘మా అమ్మాయి ఏ ఆట ఆడినా ఏనాడూ వద్దనలేదు. తనపై మాకు అంత గట్టి నమ్మకం ఉండేది. రూ.1 లక్ష 40 వేలతో ఆమెకు తొలిసారి గన్‌ కొనిచ్చిన రోజు నాకు బాగా గుర్తుంది. ఈ రోజు ఆమె సాధించిన ఘనత ముందు ఆ విలువ ఏమాత్రం ఎక్కువగా అనిపించడం లేదు’ అని ఆమె తండ్రి రామ్‌ కిషన్‌ గర్వంగా అన్నారు. చదువులోనూ ఎక్కడగా తగ్గని మను పదో తరగతి పరీక్షల్లో 10 సీజీపీఏ సాధించడం విశేషం. క్రీడల్లో ఉండేవారు సాధారణంగా ఎంచుకునే సులువైన సబ్జెక్ట్‌లకు భిన్నంగా మెడిసిస్‌ పూర్తి చేయాలనేది ఆమె లక్ష్యం. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో తమ కూతురు సత్తా చాటుతుందని ఆమె తల్లి సుమేధ ఆత్మవిశ్వాసంతో చెబుతోంది.  

సంచలన షూటర్‌... 
మను భాకర్‌ సత్తా ఏమిటో గత డిసెంబర్‌లో తిరువనంతపురంలో జరిగిన సీనియర్‌ నేషనల్స్‌ చాంపియన్‌షిప్‌లోనే అందరికీ తెలిసింది. ఈ ఈవెంట్‌లో మను ఏకంగా 9 స్వర్ణాలు సహా మొత్తం 15 పతకాలు సాధించింది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో సీనియర్‌ హీనా సిద్ధును ఓడించిన మను... ఈ క్రమంలో హీనా పేరిట సుదీర్ఘ కాలంగా ఉన్న అత్యధిక పాయింట్ల (240.6 పాయింట్లు) జాతీయ రికార్డును కూడా బద్దలు కొట్టి స్వర్ణం నెగ్గింది.    

తొలి ప్రపంచకప్‌లోనే స్వర్ణం గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో వివిధ పోటీల్లో     నా ప్రదర్శన మరింత మెరుగ్గా ఉండేలా ప్రయత్నిస్తా
– మను భాకర్‌  

మరిన్ని వార్తలు