మెరిసిన శ్రేయస్‌ అయ్యర్, ఖలీల్‌

13 Jul, 2019 08:58 IST|Sakshi
శ్రేయస్‌ అయ్యర్‌, ఖలీల్‌ అహ్మద్‌

తొలి వన్డేలో విండీస్‌ ‘ఎ’పై భారత్‌ ‘ఎ’ విజయం

అంటిగ్వా: బ్యాటింగ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ (107 బంతుల్లో 77; 8 ఫోర్లు, సిక్స్‌), బౌలింగ్‌లో ఖలీల్‌ అహ్మద్‌ (3/16) మెరిపించడంతో... వెస్టిండీస్‌ ‘ఎ’తో జరిగిన తొలి అనధికారిక వన్డే మ్యాచ్‌లో భారత్‌ ‘ఎ’ జట్టు 65 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ ‘ఎ’ 48.5 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. విండీస్‌ బౌలర్ల ధాటికి భారత్‌ ‘ఎ’ 22 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో అయ్యర్, ఆంధ్ర రంజీ క్రికెటర్‌ హనుమ విహారి (63 బంతుల్లో 34; 3 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.

నాలుగో వికెట్‌కు 95 పరుగులు జోడించారు. విండీస్‌ ‘ఎ’ బౌలర్లలో అకీమ్‌ జోర్డాన్‌ (4/43), రోస్టన్‌ ఛేజ్‌ (4/19) రాణించారు. అనంతరం విండీస్‌ ‘ఎ’ భారత బౌలర్ల ధాటికి 35.5 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. విండీస్‌ జట్టులో జొనాథన్‌ కార్టర్‌ (41 నాటౌట్‌), రావ్‌మన్‌ పావెల్‌ (40 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), పియరీ (12) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ రెండంకెల స్కోరు దాటలేకపోయారు. భారత బౌలర్లలో అక్షర్‌ పటేల్, రాహుల్‌ చహర్, వాషింగ్టన్‌ సుందర్‌ రెండేసి వికెట్లు తీశారు.  

మరిన్ని వార్తలు