కామన్‌వెల్త్‌ గేమ్స్‌: సైనా నెహ్వాల్‌ ఆగ్రహం

3 Apr, 2018 09:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ షట్లర్‌ సైనా సెహ్వాల్‌ కామన్‌వెల్త్‌ గేమ్స్‌ నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జట్టు అధికారిగా తన తండ్రిని తనతోపాటు కామన్‌వెల్త్‌ క్రీడాగ్రామంలోకి  అనుమతించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

‘కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొనేందుకు మేం భారత్‌ నుంచి వచ్చాం. టీమ్‌ అధికారిగా మా నాన్నను అధికారికంగా ధ్రువీకరించడంతో నేనే ఆయన ఖర్చులన్నీ భరించాను. తీరా మేం ఇక్కడి క్రీడాగ్రామానికి వచ్చాక.. నాన్న పేరును టీమ్‌ అధికారి క్యాటగిరీ నుంచి తొలగించారు. దీంతో ఆయన నాతోపాటు ఉండలేరు. నా మ్యాచ్‌లనూ చూడలేరు. క్రీడాగ్రామంలోకి ప్రవేశించలేరు. నాన్న నన్ను కలిసే అవకాశమే లేదు. ఇది ఎలాంటి మద్దతు’ అంటూ సైనా కామన్‌వెల్త్‌ క్రీడా నిర్వాహకులను ట్విటర్‌లో నిలదీశారు.

‘నాకు నాన్న మద్దతు కావాలి. అందుకే రెగ్యులర్‌గా నా మ్యాచ్‌లకు ఆయనను తీసుకెళుతుంటాను. కానీ, ఆయనకు ఇక్కడ ప్రవేశం ఉండదని ముందే నాకు ఎందుకు చెప్పలేదో అర్థం కావడం లేదు’ అని సైనా నిర్వేదం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో రేపటి (బుధవారం) నుంచి కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈసారి కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారతీయ క్రీడాకారులు గణనీయమైన పతకాలు సాధిస్తారని భావిస్తున్న నేపథ్యంలో సైనాకు ఇలా చేదు అనుభవం ఎదురుకావడం ఆమె అభిమానుల్ని బాధిస్తోంది.

మరిన్ని వార్తలు