ఆ క్షణం ఇంకా రాలేదు

4 Apr, 2020 03:22 IST|Sakshi

ప్రపంచ కప్‌ సాధించిన రోజే చిరస్మరణీయం అవుతుంది

భారత మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన మనోగతం

అభిమానులతో భారత బ్యాటర్‌ సరదా ముచ్చట్లు

ముంబై: స్మృతి మంధాన... క్రీజ్‌లో ఉన్నప్పుడు దూకుడుగా బ్యాటింగ్‌ చేయడమే కాదు,  మైదానం బయట కూడా అంతే చురుగ్గా కనిపించే ఈతరం అమ్మాయి. భారత ఓపెనర్‌గా ఎన్నో చూడచక్కటి ఇన్నింగ్స్‌లు ఆడిన స్మృతి క్రికెట్‌ ముగిశాక తన సొంత ప్రపంచంలో చేసే అల్లరికి అంతే ఉండదు. సహచరురాలు జెమీమా రోడ్రిగ్స్‌ కూడా జత కలిసిందంటే అంతు లేని ఆటపాటలతో ఇక ఫుల్‌ బిజీ. భారత డ్రెస్సింగ్‌ రూమ్‌లో వీరిద్దరూ అందించే వినోదం ప్రత్యేకం. ఇప్పుడు లాక్‌డౌన్‌ కారణంగా ఆటగాళ్లంతా తమ ఇళ్లలోనే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో సరదాగా మాట్లాడుకుందామని అభి మానులకు స్మృతి పిలుపునిచ్చింది. ట్విట్టర్‌ వేదికగా ఆస్క్‌ స్మృతి అంటూ సాగిన సంభాషణలో మహారాష్ట్రకు చెందిన 23 ఏళ్ల ఈ లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌ తన మనసు విప్పి పలు ఆసక్తికర విషయాలు చెప్పింది. విశేషాలు స్మృతి మంధాన మాటల్లోనే.... 
► మైదానంలో దిగాక అతిగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తా. బ్యాటింగ్‌ సమయంలో కూడా ఒకేసారి ప్రణాళిక రూపొందించుకోకుండా ఒక్కో బంతికి అనుగుణంగా నా ఆటతీరును మార్చుకుంటా.  
► అంతర్జాతీయ క్రికెట్‌లో నేను ఎంతో మంది బౌలర్లను ఎదుర్కొన్నా... వారిలో మరిజాన్‌ కాప్‌ (దక్షిణాఫ్రికా పేసర్‌) బౌలింగ్‌లో పరుగులు తీయడానికి చాలా కష్టపడ్డాను.  
► కెరీర్‌కు సంబంధించి భారత్‌ తరఫున తొలి మ్యాచ్‌ ఆడిన రోజు నా కెరీర్‌లో మరచిపోలేనిది. అయితే చిరస్మరణీయ క్షణం మాత్రం ఇంకా రాలేదు. బహుశా భవిష్యత్తులో మేం ప్రపంచ కప్‌ సాధించిన రోజు అది కావచ్చు.  
► సరదాగా చెప్పాలంటే నా మొహం ఇన్ని రోజులు చూస్తూ మా ఇంట్లో వాళ్లే అలసిపోయారు. ఎప్పుడెప్పుడు తర్వాతి టోర్నీ ఉంటుందా అంటున్నారు. అయితే ఈ సమయాన్ని చాలా బాగా గడుపుతున్నామనేది మాత్రం వాస్తవం.  
► చిన్నప్పుడు నాకిష్టమైన కార్టూన్ల జాబితాలో నాడీ, బాబ్‌ ద బిల్డర్, నింజా హటోరి ఉన్నాయి. ఇప్పుడు కూడా సమయం దొరికితే వాటిని చూస్తుంటా.  
► అరిజిత్‌ సింగ్‌ కాకుండా నాకు ప్రస్తుతం ఇష్టమైన బాలీవుడ్‌ గాయకుడు ప్రతీక్‌ బచ్చన్‌ (సరిలేరు నీకెవ్వరులో సూర్యుడివో, చంద్రుడివో పాట పాడాడు) నా హోటల్‌ (ఎస్‌ఎం 18 పేరుతో సాంగ్లీలో ఉంది)లో ఏం బాగుంటాయని అడిగారు. మా మెనూలో అన్ని ఐటమ్స్‌ మీకు నచ్చుతాయి. ఒకసారి తెరిచాక వచ్చి రుచి చూడవచ్చు.  
► అందంగా ఉంటావు కాబట్టి సినిమాల్లో చేయవచ్చు కదా అని ఒక అభిమాని అడిగాడు. అయితే నన్ను చూడటానికి ఎవరైనా థియేటర్‌కు వస్తారని నేను అనుకోవడం లేదు. కాబట్టి మీరు కూడా అలాంటివి అస్సలు ఆశించవద్దు.  
► ప్రస్తుతం నేను ఒంటరిగా ఉన్నానా అని అడుగుతున్నారు.... ఏమో చెప్పలేను. నాకైతే తెలీదు. 
► నా జీవిత భాగస్వామి కావాలనుకునే వ్యక్తి నన్ను ప్రేమించేవాడై ఉండాలనేది మొదటి షరతు. ఈ మొదటి షరతుకు కావాల్సిన నిబంధనలను పాటించాలనేది నా రెండో షరతు.  
► ప్రేమ పెళ్లా, పెద్దలు కుదిర్చిన పెళ్లా (లవ్‌ ఆర్‌ అరేంజ్‌డ్‌) అని అడిగితే లవ్‌–రేంజ్‌డ్‌ అని చెబుతా.  నాకు దగ్గరలో జెమీమా లేకపోవడం వల్ల లోటేమీ తెలియడం లేదు. ఇంకా కాస్త ప్రశాంతంగా ఉంటున్నా (దీనిపై స్పందించిన జెమీమా... నువ్వు మోసగత్తెవంటూ ట్విట్టర్‌లోనే సరదాగా బదులిచ్చింది).

గతంలో కళ్లద్దాలు పెట్టుకొని నేను బ్యాటింగ్‌ చేసేదాన్ని. అయితే మూడేళ్ల క్రితం అది మారింది. 2017లో గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కాంటాక్ట్‌ లెన్స్‌లను వాడటం అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు నేను  చాలా సౌకర్యవంతంగా ఉన్నా.


తల్లిదండ్రులతో...

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా