49 మంది ఖర్చులు భరించం 

12 Aug, 2018 01:37 IST|Sakshi

ఆసియా క్రీడల సహాయ సిబ్బందిపై క్రీడా శాఖ నిర్ణయం

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పాల్గొనే 804 మందితో కూడిన భారత బృందానికి ఆమోదం తెలిపిన కేంద్ర క్రీడా శాఖ ఇందులో 49 మంది సహాయ సిబ్బంది ఖర్చుల్ని మాత్రం భరించమని స్పష్టం చేసింది. వీరిలో ముగ్గురు కోచ్‌లు కాగా, 26 మంది మేనేజర్లు, 20 మంది అధికారులున్నారు. వీరిని కూడా భారత ఒలింపిక్‌ సంఘమే (ఐఓఏ) సిఫార్సు చేసినప్పటికీ రోజువారీ ఖర్చులు మాత్రం సంబంధిత సమాఖ్యలే భరించాలని క్రీడాశాఖ తెలిపింది.  కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ ఆధ్వర్యంలో ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బృందానికి వీడ్కోలు కార్యక్రమం జరిగిన మరుసటి రోజు క్రీడా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇండోనేసియా పయనమయ్యే బృందంలో 755 మంది ఖర్చుల్ని ప్రభుత్వం భరిస్తుందని క్రీడాశాఖ తెలిపింది. భారత బృందంలో 572 మంది అథ్లెట్లు కాగా, 232 మంది కోచ్‌లు, ఫిజియోలు, మేనేజర్లు ఉన్నారు. అథ్లెట్లు, కోచ్‌ల ఖర్చుల కోసం రోజుకు 50 అమెరికా డాలర్లు (రూ. 3,454), డాక్టర్లకు 25 డాలర్లు (రూ. 1,727) చొప్పున చెల్లిస్తారు. జకార్తా వెళ్లినప్పటి నుంచి ఈవెంట్‌ ముగిసిన మరుసటి రోజు దాకా ఈ చెల్లింపులు ఉంటాయి. గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌ ఉదంతంతో ఈసారి క్రీడాకారుల తల్లిదండ్రులకు ఈ బృందంలో చోటులేదు.  

మరిన్ని వార్తలు