విద్యార్థులే లక్ష్యంగా దాడులా...?

7 Jan, 2020 01:07 IST|Sakshi

జేఎన్‌యూలో దాడిని ఖండించిన క్రీడాలోకం

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో దుండగుల వీరంగాన్ని భారత క్రీడాలోకం ఖండించింది. ఆదివారం రాత్రి ముఖాలకు ముసుగులు ధరించిన దుండగులు వర్సిటీలోకి చొరబడి విద్యార్థులు, ప్రొఫెసర్లపై విచక్షణ రహితంగా కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఇందులో విద్యార్థి యూనియన్‌ అధ్యక్షురాలు ఆయుషి ఘోష్‌ సహా 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఉదంతంపై భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్, ఇటీవల రిటైర్మెంట్‌ ప్రకటించిన ఇర్ఫాన్‌ పఠాన్, అగ్రశ్రేణి టెన్నిస్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న, బ్యాడ్మింటన్‌ స్టార్‌ గుత్తా జ్వాల ట్విట్టర్‌లో స్పందిస్తూ దాడిని ముక్తకంఠంతో ఖండించారు.

‘వర్సిటీ క్యాంపస్‌లో జరిగిన హింస భారత దేశ సంస్కృతికి విరుద్ధమైంది. కారణాలేవైనా కావొచ్చు... కానీ విద్యార్థులే లక్ష్యంగా దాడి చేయడం హేయమైన చర్య. ఇలాంటి దుండగులను కఠినంగా 
శిక్షించాల్సిందే’.  –గౌతమ్‌ గంభీర్‌

‘జేఎన్‌యూలో ఆదివారం జరిగిన ఘటన దారుణమైనది. ఏకంగా క్యాంపస్‌లోపలే ఉన్న హాస్టళ్లలో చొరబడి ఇలా విచక్షణా రహితంగా దాడిచేయడం మన దేశ ప్రతిష్టను దిగజార్చుతుంది’. –ఇర్ఫాన్‌ పఠాన్‌

‘యూనివర్సిటీ క్యాంపస్‌లో భయానక దాడి జరిగింది. ఇది సిగ్గుచేటు. ఎవరైతే ఈ దురాగతానికి పాల్పడ్డారో వారిని కచ్చితంగా కఠినంగా శిక్షించాలి’. – రోహన్‌ బోపన్న

‘ఇంత జరిగాక కూడా మౌనమేంటి? విద్యార్థుల్ని ఎలా చావబాధారో చూశాం. దుండగుల్ని ఉపేక్షించడం ఎంతమాత్రం తగదు. పట్టుకొని శిక్షించాల్సిందే’. –గుత్తా జ్వాల

మరిన్ని వార్తలు