‘సన్‌రైజర్స్‌’ దబిడిదిబిడి; వైరల్‌ వీడియో

22 Apr, 2018 11:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జనరంజకంగా సాగుతోన్న ఐపీఎల్‌ 2018 మధ్యలో ‘బాలయ్య డైలాగ్‌’ వైరల్‌ అయింది. తనకు మాత్రమే సాధ్యమనే రీతిలో అద్భుతమైన డైలాగులు చెబుతూ ప్రేక్షకులను రంజింపజేస్తారు హీరో నందమూరి బాలకృష్ణ. కొత్త సినిమా వచ్చిన ప్రతిసారి అభిమానులు ఆయన డైలాగ్స్‌ను ఇమిటేట్‌చేస్తూ సోషల్‌మీడియాలో వీడియోలు పెడుతుండటం తెలిసిందే. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్‌ అలెక్స్‌ హేల్స్‌ సైతం బాలయ్య డైలాగ్‌తో దబిడిదిబిడిలాడించాడు. వివరాల్లోకి వెళితే..

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు భువనేశ్వర్, మనీశ్‌ పాండే, అలెక్స్‌ హేల్స్‌లు శనివారం బంజారాహిల్స్‌లోని సెంట్రో షోరూమ్‌లో సందడి చేశారు. ‘జస్ట్‌ ఛేంజ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా పలువురు వర్ధమాన క్రీడాకారులతో ముచ్చటించారు. చాలా మంది చిన్నారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆద్యాంతం సరదాగా సాగిన వేడుకలో చిన్నారులు కొందరు సన్‌రైజర్స్‌ ఆటగాళ్లను వినూత్నమైన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. పిల్లల కోరిక మేరకు ‘శ్రీమన్నారాయణ’  సినిమాలో బాలకృష్ణ చెప్పిన ‘డోన్ట​ ట్రబుల్‌ ది ట్రబుల్‌..’ డైలాగ్‌ను అలెక్స్‌ హేల్స్ ఇమిటేట్‌​ చేశారు. మొదటి ప్రయత్నంలోనే.. అచ్చం బాలయ్య మాదిరే హేల్స్‌ డైలాగ్‌ చెప్పేయడంతో కోలాహలం ఒక్కసారే మిన్నంటింది.

చిన్నారులు అడిగిన మరికొన్ని ప్రశ్నలు..
క్రికెట్‌ ఆడకపోయి ఉంటే ఏం చేసేవారని ఓ చిన్నారి భువనేశ్వర్‌ కుమార్‌ను ప్రశ్నించగా... తాను ఆర్మీలో చేరేవాడినని అతను తెలిపాడు. మిగతా ప్రశ్నలకు సమాధానమిస్తూ భువీ ‘క్రీడాకారులుగానే కాకుండా జీవితంలో ఎదగాలంటే కష్టపడేతత్వం ఉండాలి. శ్రమిస్తేనే ఏదైనా సాధించగలం. నాకే కాదు ప్రతీ క్రికెటర్‌కు సచిన్‌ టెండూల్కరే మార్గదర్శి’ అని చెప్పాడు. సన్‌రైజర్స్‌ జట్టులో చిలిపి చేష్టలు ఎవరు చేస్తారని మరో చిన్నారి ప్రశ్నించగా, బిపుల్‌ శర్మ కామెడీ బాగా చేస్తాడని, అందరినీ ఆటపట్టిస్తుంటాడని మనీశ్‌ పాండే సమాధానమిచ్చాడు.

మరిన్ని వార్తలు