కెప్టెన్సీ నుంచి  మాథ్యూస్‌కు ఉద్వాసన

25 Sep, 2018 00:50 IST|Sakshi

కొలంబో: ఆసియా కప్‌లో పేలవ ప్రదర్శన కనబరిచిన శ్రీలంక కెప్టెన్‌ ఎంజెలో మాథ్యూస్‌పై వేటు పడింది. వన్డే, టి20 జట్టు సారథ్య బాధ్యతల నుంచి మాథ్యూస్‌ను తప్పిస్తున్నట్లు లంక క్రికెట్‌ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) తెలిపింది. దుబాయ్, అబుదాబిల్లో జరుగుతున్న ఆసియా కప్‌లో లంక అనూహ్యంగా తక్కువ ర్యాంకులో ఉన్న అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌ చేతిలో కంగుతిన్న సంగతి తెలిసిందే. దీంతో జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ పర్యటన కోసం అతని స్థానంలో దినేశ్‌ చండిమాల్‌కు జట్టు పగ్గాలు అప్పగించారు. ఇప్పటికే అతను టెస్టులకు సారథ్యం వహిస్తున్నాడు. తాజాగా ఇక మూడు ఫార్మాట్లకు అతనే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గత రెండేళ్లలోనే లంక బోర్డు వన్డేల్లో ఆరు మంది కెప్టెన్లను మార్చింది. టెస్టుల్లో, టి20ల్లో నలుగురు చొప్పున కెప్టెన్లను మార్చింది. వన్డేల్లో అసలు స్థిరమైన నాయకత్వమే లేకుండా తరంగ, మాథ్యూస్, కపుగెడెర, మలింగ, తిసారా పెరీరా, చండిమాల్‌లను తరచూ మార్చేసింది. 

బలిపశువును చేశారు... 
ఆసియా కప్‌ వైఫల్యానికి తనను ఒక్కడినే బాధ్యుడిని చేస్తూ బలిపశువును చేయడం అన్యాయమని మాథ్యూస్‌ ఆరోపించాడు. ఆ టోర్నీలో అంతా విఫలమైనపుడు తాను మాత్రం చేయగలిగేదేమి లేదని అన్నాడు. తాజా పరిస్థితులపై కలత చెందానని రిటైర్మెంట్‌ ప్రకటిస్తానని బోర్డును ఉద్దేశించి హెచ్చరించాడు.  

మరిన్ని వార్తలు