వారి పోరు చూడాల్సిందే 

14 Apr, 2019 03:18 IST|Sakshi

సునీల్‌ గావస్కర్‌

ఇప్పటికే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. తమ ఓటమి పరంపర కొనసాగకుండా గెలుపుబాట పట్టాలని ఆ జట్టు పట్టుదలతో ఉంది. సునీల్‌ నరైన్‌ సేవలు అందుబాటులో లేకపోవడం కోల్‌కతాకు ఇబ్బందికరమే. ఈ సీజన్‌లో బౌలర్‌గా నరైన్‌ అంతగా ప్రభావం చూపలేకపోయినా ఓపెనర్‌గా మాత్రం రాణించాడు. నరైన్‌ ధాటిగా పరుగులు చేసి శుభారంభం అందిస్తుండటంతో ఆ తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్‌పై ఎలాంటి ఒత్తిడి లేకుండా పోతోంది. శుబ్‌మన్‌ గిల్‌ను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు పంపించడం మంచి ఎత్తు కాగా... రాబిన్‌ ఉతప్ప కూడా బ్యాట్‌ ఝళిపిస్తే కోల్‌కతాకు ఎదురుండదు. దినేశ్‌ కార్తీక్‌ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే కోల్‌కతాకు భారీ స్కోర్‌ చేసే అవకాశం ఉంటుంది. కుల్దీప్‌ యాదవ్‌ మినహా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. ప్రసిధ్‌ కృష్ణ భారీగా పరుగులు ఇస్తుండగా... రసెల్‌ బౌలింగ్‌లో నిలకడ కనిపించడంలేదు. ఇక చెన్నై సూపర్‌ కింగ్స్‌ జోరు మీదుంది. పాయింట్ల పట్టికలో అగ్రభాగాన ఉంది.

చివరి ఓవర్లలో చెన్నై జట్టు అద్భుతంగా ఆడుతోంది. మిగతా జట్లకు చెన్నై జట్టుకు ఇదే తేడా కనిపిస్తోంది. క్లిష్ట సమయాల్లో చెన్నై ఆటగాళ్లు తమ అనుభవాన్నంతా రంగరించి పోరాడుతున్నారు. అంపైర్లతో వాగ్వాదం వివాదాన్ని ధోని మర్చిపోయి మరో విజయంపై దృష్టి పెట్టాలి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌ కూడా ఆసక్తికరంగా జరిగే అవకాశముంది. కోల్‌కతాను ఢిల్లీ జట్టు సునాయాసంగా ఓడించడం... శిఖర్‌ ధావన్‌ ఫామ్‌లోకి రావడం, రిషభ్‌ పంత్, శ్రేయస్‌ అయ్యర్‌ కూడా మెరిపిస్తుండటం ఢిల్లీకి సానుకూలాంశం. ఈడెన్‌ గార్డెన్స్‌ తరహా పిచ్‌ లభిస్తే ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లు ప్రత్యర్థి జట్టును కట్టడి చేయగలరు. ఢిల్లీ బౌలర్లు ఇషాంత్‌ శర్మ, రబడ, మోరిస్‌... సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మన్‌ బెయిర్‌స్టో, డేవిడ్‌ వార్నర్‌ మధ్య పోరు చూడాల్సిందే.         సన్‌రైజర్స్‌కు బెయిర్‌స్టో, వార్నర్‌ దూకుడైన ఆరంభం ఇస్తే ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశముంది.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు