‘సినిమా ఇంకా ఉంది’

21 Sep, 2018 01:15 IST|Sakshi

సునీల్‌ గావస్కర్‌

ఆసియా కప్‌ను మళ్లీ నిలబెట్టుకునే క్రమంలో పాకిస్తాన్‌పై సాధించిన సాధికార విజయం భారత జట్టులో ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేయడం ఖాయం. హాంకాంగ్‌లాంటి అసోసియేట్‌ జట్టుపై చెమటోడుస్తూ దాదాపు 100 ఓవర్ల పాటు మైదానంలో గడపాల్సి వచ్చినా పాక్‌పై చూపించిన ఆట అద్భుతం. పాండ్యా గాయం మాత్రమే భారత్‌ను కలవరపరిచే అంశం. అతని స్థానంలో ఎవరికి ఆడిస్తారనేది చూడాలి. పాకిస్తాన్‌పై, అంతకుముందు హాంకాంగ్‌పై ప్రదర్శనను బట్టి చూస్తే తాను ఆల్‌రౌండర్‌ పాత్రకు సరిగ్గా సరిపోతానని కేదార్‌ జాదవ్‌ నిరూపించాడు. ప్రత్యర్థులు అతడిని తక్కువగా అంచనా వేశారా లేక అతని బౌలింగ్‌ శైలికే ఆశ్చర్యపోయారా తెలీదు కానీ మొత్తానికి తన జట్టు తరఫున అతను సత్తా చాటాడు. ప్రధాన బౌలర్లు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే కెప్టెన్‌కు జాదవ్‌ మంచి ప్రత్యామ్నాయం కాగలడు. ధావన్, రోహిత్‌ ఫామ్‌లోకి రావడం భారత్‌ను సంతోషపెట్టే విషయం. దూకుడైన ఆరంభం లభిస్తే ఆ తర్వాత భారీ స్కోరు సాధిం చడం సులువవుతుంది. రాయు డు కూడా మంచి టచ్‌లో కనిపిస్తుండగా డైరెక్ట్‌ త్రోతో అతను షోయబ్‌ మాలిక్‌ను రనౌట్‌ చేసిన తీరు పాకిస్తాన్‌ చివర్లో చెలరేగిపోకుండా చేసింది.  

గత ఏడాది కాలంగా భారత పేస్‌ బౌలింగ్‌ దళం ఎంతో ఎదిగిపోయింది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా వికెట్లు తీయగలమని నిరూపించింది. తీవ్రమైన ఎండలు ఉన్న ఎడారిలో కూడా వారి ప్రదర్శన అభినందనీయం. భారత్, పాక్‌ మధ్య మ్యాచ్‌ గురించి భారీగా అంచనాలు పెరిగిపోతుంటే మరో వైపు బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌వంటి జట్లను తేలిగ్గా చూసే ప్రమాదం పొంచి ఉంటుంది. హాంకాంగ్‌తో మ్యాచ్‌ అనుభవం తర్వాత భారత్‌ మళ్లీ తప్పు చేయలేదు. టోర్నీలో ప్రతీ మ్యాచ్‌ నెగ్గాలనే పట్టుదల కనబరుస్తూ పాక్‌పై గెలిచి చూపించింది. శ్రీలంకపై విజయంపై వన్డేల్లో తమ ఆట ఎలాంటిదో బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ నిరూపించాయి. అఫ్గానిస్తాన్‌ ఒక వేళ ముందుగా బ్యాటింగ్‌కు దిగి 250 పరుగుల వరకు చేస్తే ఇక్కడి పిచ్‌లపై వారి స్పిన్నర్లు ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగలరు. విరిగిన చేత్తోనే బ్యాటింగ్‌కు వచ్చిన తమీమ్‌ ఇక్బాల్‌ను చూస్తే బంగ్లాదేశ్‌ కూడా ఎంత పట్టుదలగా ఉందో అర్థమవుతుంది. పాకెట్‌ డైనమో ముష్ఫికర్‌ రహీమ్‌ మ్యాచ్‌ మ్యాచ్‌కూ మెరుగవుతున్నాడు. అటాకింగ్‌తో పాటు తక్కువ స్కోరును కూడా కాపాడుకోగలిగే బౌలింగ్‌ వనరులు ఆ జట్టుకు ఉన్నాయి. పాకిస్తాన్‌ను ఓడించడంతో భారత్‌ అన్ని జట్లకంటే పై స్థాయిలో కనిపించడం వాస్తవమే కానీ ‘సినిమా ఇంకా మిగిలే ఉంది’ అని మరచిపోవద్దు! 

మరిన్ని వార్తలు