Sakshi News home page

CWC 2023 Final: టీమిండియా ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అంతే: దిగ్గజ క్రికెటర్‌ హెచ్చరిక

Published Sat, Nov 18 2023 11:10 AM

CWC 2023 Final Ind vs Aus: Australians Can never be written off: Gavaskar - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్లో రెండు అత్యుత్తమ జట్లు తలపడటం సంతోషంగా ఉందని భారత క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ అన్నాడు. లీగ్‌ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా సెమీస్‌లో సత్తా చాటిందన్న ఈ మాజీ ఓపెనర్‌.. పడిలేచిన కెరటంలా ఆస్ట్రేలియా తుదిమెట్టుకు చేరుకున్న తీరు అద్భుతమని ప్రశంసించాడు.

ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడేందుకు ఈ రెండు జట్లు వందకు వందశాతం అర్హత కలిగినవే అని గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. అయితే, ఫైనల్లో భారత జట్టు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ మూల్యం చెల్లించకతప్పదని రోహిత్‌ సేనను హెచ్చరించాడు. 

పట్టువదలని విక్రమార్కుల్లా ఆఖరి వరకు పోరాడే ఆటగాళ్లున్న ఆస్ట్రేలియాతో పోటీ అంటే మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. కాగా సొంతగడ్డపై ప్రపంచకప్‌-2023 టోర్నీలో ఇప్పటి దాకా అపజయమన్నదే ఎరుగని టీమిండియా ఫైనల్లో కంగారూ జట్టుతో పోటీకి సిద్ధమైంది. 

కాగా ఆరంభ మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసిన ఆస్ట్రేలియా.. ఆ తర్వాత వరుస విజయాలతో తుదిపోరుకు అర్హత సాధించింది. ముఖ్యంగా అఫ్గనిస్తాన్‌తో లీగ్‌ మ్యాచ్‌లో ఓడిపోవడం ఖాయమనుకున్న తరుణంలో.. ఆ జట్టు ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ అజేయ డబుల్‌ సెంచరీతో.. అనూహ్య విజయం అందించాడు.

ఇక సౌతాఫ్రికాతో సెమీ ఫైనల్లో ఓపెనర్‌ ట్రవిస్‌ హెడ్‌ బ్యాట్‌తోనే కాకుండా బంతితోనూ మెరిసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. కీలక సమయాల్లో ఇలా ఎవరో ఒకరు అద్భుత ఆట తీరుతో గట్టెక్కించి ఆస్ట్రేలియాను ఇక్కడి దాకా తీసుకువచ్చారు.

ఈ క్రమంలో ఇప్పటికే ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఆసీస్‌.. ఆరో టైటిల్‌ను ఖాతాలో వేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో సునిల్‌ గావస్కర్‌ ఇండియా టుడే మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీమిండియా అద్భుతంగా ఆడుతోంది కాబట్టే టైటిల్‌ ఫేవరెట్‌గా ఉంది.

కానీ ఆస్ట్రేలియన్లు అంత తేలికగ్గా తలవంచేవాళ్లు రకం కాదు. గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ఆరోజు ఎలా ఆడాడో చూశాం కదా! ఆఖరి వరకు పట్టుదలగా నిలబడి జట్టును గెలిపించుకున్నాడు. దేశం కోసం గెలవాలన్న కసి వారిలో ఎంతగా ఉంటుందో మరోసారి నిరూపించాడు.

కాబట్టి ఆసీస్‌ను తక్కువగా అంచనా వేస్తే భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది’’ అని సునిల్‌ గావస్కర్‌ ఇండియా టుడేతో వ్యాఖ్యానించాడు. కాగా అహ్మదాబాద్‌ వేదికగా ఆదివారం టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది.

Advertisement

What’s your opinion

Advertisement