సన్‌రైజర్స్‌ చెత్త రికార్డు

24 Apr, 2018 21:56 IST|Sakshi

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటింగ్‌లో తడబడింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. కేన్‌ విలియమ్సన్‌(29), యూసఫ్‌ పఠాన్‌(29) మోస్తరుగా ఫర్వాలేదనిపించగా, మిగతా బ్యాటింగ్‌ లైనప్‌ ఘోరంగా విఫలమైంది. దాంతో సన్‌రైజర్స్‌ 119 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ముంబైకి నిర్దేశించింది.


సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ విభాగంలో శిఖర్‌ ధావన్‌(5) నిరాశపరచగా, వృద్దిమాన్‌ సాహా పరుగుల ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు. వీరిద్దరూ బంతి వ్యవధిలో వికెట్లు సమర్పించుకోవడంతో సన్‌రైజర్స్‌ 20 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆపై విలియమ్సన్‌-మనీష్‌ పాండే జోడి కాసేపు మరమ్మత్తులు చేసింది. అయితే సన్‌రైజర్స్‌కు మరోసారి షాకిచ్చింది ముంబై ఇండియన్స్‌. మనీష్‌(16), షకిబుల్‌ హసన్‌(2)లు రెండు పరుగుల వ్యవధిలో పెవిలియన్‌కు పంపి సన్‌రైజర్స్‌ను మరింత కష్టాల్లోకి నెట్టింది. ఆ తరుణంలో కేన్‌ విలియమ్సన్‌ బాధ్యతాయుతంగా ఆడే యత్నం చేసినప్పటికీ ఎంతో సేపో క్రీజ్‌లో నిలవలేదు. జట్టు స్కోరు 63 పరుగుల వద్ద విలియమ‍్సన్‌ ఐదో వికెట్‌ పెవిలియన్‌ బాటపట్టాడు.

ఇక చివరి వరుస ఆటగాళ్లలో మహ్మద్‌ నబీ(14) బ్యాట్‌ ఝుళిపించే క్రమంలో ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. రషీద్‌ ఖాన్‌(6), బాసిల్‌ థంపి(3), సిద్దార్ధ్‌ కౌల్‌(2)లు ఇలా వచ్చి అలా పెవిలియన్‌ చేరడంతో సన్‌రైజర్స్‌ 18.4 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఈ సీజన్‌లో ఇప‍్పటివరకూ జరిగిన మ్యాచ్‌ల్లో అత్యల్ప స్కోరును నమోదు చేసిన జట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది. మరొకవైపు ఐపీఎల్‌ చరిత్రలో సన్‌రైజర్స్‌కు ఇది రెండో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. ముంబై బౌలరల్లో మెక్లీన్‌గన్‌, హార్దిక్‌ పాండ్యా, మయాంక్‌ మార్కండే తలో రెండు వికెట్లు సాధించగా, బుమ్రా, ముస్తాఫిజుర్‌లకు తలో వికెట్‌ దక్కింది.

>
మరిన్ని వార్తలు