‘మాజీ క్రికెటర్లు టాయ్‌లెట్లలో పనిచేసేందుకైనా సిద్ధమే’

18 Jan, 2019 11:22 IST|Sakshi

పాక్‌ మాజీ ఆటగాళ్లపై పేసర్‌ తన్వీర్‌ అహ్మద్‌ అనుచిత వ్యాఖ్యలు

కరాచి : పాకిస్తాన్‌ టెస్టు ఆటగాడు, పేస్‌ బౌలర్‌ తన్వీర్‌ అహ్మద్‌ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేసి క్రికెట్‌ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. గతేడాది యూఏఈలో జరిగిన ఆసియాకప్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి బీసీసీఐ విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, పాక్‌తో తలపడేందుకు భయపడి విరాట్‌ టోర్నీ నుంచి తప్పుకున్నాడని వ్యాఖ్యానించి తన్వీర్‌ తీవ్ర విమర్శల పాలయ్యాడు. క్రికెట్‌ అభిమానుల ట్రోలింగ్‌ను తట్టుకోలేక తన్వీర్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్లను కోజ్‌ చేసుకోవాల్సి వచ్చింది.

తాజాగా.. స్వదేశీ మాజీ క్రికెటర్లపై కూడా నోరుజారిన తన్వీర్‌ మరోసారి అభిమానుల కోపానికి కారణమయ్యాడు. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)లో పనిచేసేందుకు మాజీ ఆటగాళ్లకు అవకాశం లభించడం లేదని, కనీసం అక్కడ టాయ్‌లెట్లు శుభ్రం చేసే పనిలోనైనా చేరదాం అనుకుంటున్నారని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని ఓ స్థానిక టీవీ చానెల్‌లో చెప్పుకొచ్చాడు. పాక్‌ మాజీ క్రికెటర్ల పరిస్థితి అంత దారుణంగా ఉందని అన్నాడు. దీంతో తన్వీర్‌కు పిచ్చిపట్టిందని, పెద్దలంటే కనీస గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని సోషల్‌ మీడియాలో అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు.

ఇదిలాఉండగా.. పాక్‌ మాజీ కెప్టెన్‌, పీసీబీ చీఫ్‌ సెలెక్టర్‌ ఇంజమాముల్‌ హక్‌పై కూడా తన్వీర్‌ కామెంట్‌ చేసి వార్తల్లో నిలిచాడు. ఇంజమామ్‌ తన బంధువులకు, అయినవాళ్లకు జాతీయ జట్టులో చోటు కల్పించి ప్రతిభ ఉన్న క్రీడాకారులకు అన్యాయం చేస్తున్నాడని ఆరోపించాడు. ఈ వ్యాఖ్యలు పీసీబీలో దుమారం రేపాయి. ఇంజమామ్‌ మేనల్లుడు ఇమాముల్‌ హక్‌ పాక్‌ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కోహ్లీకి విశ్రాంతినివ్వడంతో.. రోహిత్‌ శర్మ సారథ్యంలో టీమిండియా ఆసియా కప్‌ను సొం‍తం చేసుకున్న సంగతి విదితమే.

మరిన్ని వార్తలు