‘మా కేకేఆర్‌ క్యాంప్‌లో​ సఖ్యత లేదు’

6 May, 2019 20:53 IST|Sakshi

ముంబై: తాజా ఐపీఎల్‌ సీజన్‌లో తమ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరకపోవడానికి విభేదాలు కూడా ఒక కారణమని కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్‌) అసిస్టెంట్‌ కోచ్‌ సైమన్‌ కాటిచ్‌ స్సష్టం చేశాడు. కేకేఆర్‌ శిబిరంలో ఆటగాళ్ల మధ్య అంతగా సఖ్యత లేకపోవడమే వరుస ఓటములకు కారణమన్నాడు. నిన్న ముంబై ఇండియన్స్‌ చేతిలో ఓటమి తర్వాత ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన కాటిచ్‌..‘ వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి చెందడం మా ప్లేఆఫ్‌ అవకాశాలను దెబ్బతీసింది. ఇక్కడ ఒక్క విషయాన్ని చెప్పాలి. మా జట్టులో విభేదాలు ఉన్న మాట వాస్తవమే. దీన్ని దాయాలన్నా దాగదు. ఐపీఎల్‌ వంటి మెగా లీగ్‌కు సిద్ధమయ్యేటప్పుడు జట్టులో సమైక్యత అనేది చాలా ముఖ్యం.

కేకేఆర్‌ సక్సెస్‌ఫుల్‌ ఫ్రాంచైజీ అనడంలో ఎటువంటి సందేహం లేదు. గత కొన్నేళ్లుగా జట్టు విజయాలు కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేస్తూనే ఉన్నారు. కానీ ఈ సీజన్‌లో పరిస్థితిలో మార్పు వచ్చింది. ఆటగాళ్ల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఇది మంచిది కాదు’ అని కాటిచ్‌ పేర్కొన్నాడు. ఇటీవల కేకేఆర్‌ స్టార్‌ ఆటగాడు ఆండ్రీ రసెల్‌ బహిరంగంగానే ఆ జట్టు నాయకత్వాన్ని ప్రశ్నించాడు. జట్టులో ఎవర్ని ఎలా ఉపయోగించుకోవాలో తమ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ తెలియడం లేదంటూ చురకలు అంటించాడు. దాంతో ​కేకేఆర్‌ క్యాంపులో విభేదాలు ఉన్న విషయం బయటపడింది.
(ఇక్కడ చదవండి: దినేశ్‌ కార్తీక్‌ ఆగ్రహం.. జట్టు సభ్యులకు వార్నింగ్‌!)

మరిన్ని వార్తలు