‘ఒలింపిక్స్‌ను జరిపి తీరుతాం’

14 Mar, 2020 16:21 IST|Sakshi

టోక్యో: ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలా లేదంటే రద్దు చేయాలా అనేది డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సులకు అనుగుణంగానే ఉంటుందని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ ఒకవైపు చెబుతుంటే,  టోక్యో ఒలింపిక్స్‌ను  షెడ్యూల్‌ ప్రకారమే జరిపి తీరుతామని జపాన్‌ ప్రధాని షింజో అబే విశ్వాసం వ్యక్తం చేశారు. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారమే ఒలింపిక్స్‌ జరుగుతుందని, ఈ విషయంలో ఐఓసీతో కలిసి పని చేస్తున్నామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మెజారిటీ సంఖ్యలో స్పోర్ట్స్‌ ఈవెంట్‌లు వాయిదా పడిన నేపథ్యంలో ఒలింపిక్స్‌ను సైతం రీ షెడ్యూల్‌ చేస్తే బాగుంటుందని వాదన ఎ‍క్కువైంది. ఈ క్రమంలోనే మాట్లాడిన జపాన్‌ ప్రధాని షింజో​ అబే.. ఒలింపిక్స్‌ నిర్వహణ అనేది ఆలస్యం కావడం కానీ, వాయిదా పడటం కానీ జరగదన్నారు. షెడ్యూల్‌లో పేర్కొన్నట్లు జూన్‌ 24వ తేదీ నుంచే ఒలింపిక్స్‌ జరుగుతుందన్నారు. ఈ విషయంలో స్టేక్‌ హోల్డర్స్‌తో కూడా టచ్‌లో ఉన్నామన్నారు. ఒకవైపు కరోనా విజృంభణ, మరొకవైపు ఒలింపిక్స్‌ నిర్వహణ అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు  తెలిపారు.

ఇక ఐఓసీ చీఫ్‌ థామస్‌ బాచ్‌ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. ‘ఇప్పటికైతే విశ్వక్రీడల్ని విజయవంతంగా నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నాం. అయితే ఏ నిర్ణయమైనా డబ్ల్యూహెచ్‌ఓ సూచనల మేరకే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆ సంస్థతో మా ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఏదేమైనా కరోనా మహమ్మారి వల్ల ఆయా దేశాల్లో వాయిదా, రద్దయిన క్వాలిఫయింగ్‌ టోర్నీలతో పెను సవాళ్లు ఎదురవుతున్నాయి’ అని అన్నారు. జపాన్‌ మాత్రం తమ దేశంలో జూలై 24 నుంచి ఆగస్టు 8 వరకు జరిగే టోక్యో ఒలింపిక్స్‌పై గంపెడు ఆశలతో స్టేడియాలకు కొత్తసొబగులు అద్దుతోంది. 

మరిన్ని వార్తలు