ఇంధన ఉత్పత్తిలో భారత్‌ కీలక ముందడుగు.. ఇకపై దిగుమతి అక్కర్లేదు!

27 Oct, 2023 17:06 IST|Sakshi

ఇంధన ఉత్పత్తిలో భారత్‌ ముందడుగు వేసింది. ఆటోమొబైల్‌ పరిశ్రమకు కీలకమైన సూచన ఇంధనాన్ని (రెఫరెన్స్‌ ఫ్యూయల్‌) ఆవిష్కరించింది. ప్రభుత్వరంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) సహకారంతో తన మొదటి రెఫరెన్స్ ఇంధనాన్ని ప్రారంభించింది. 

రెఫరెన్స్‌ ఫ్యూయల్‌ను దేశీయంగా ఉత్పత్తి చేయనున్న మూడవ దేశంగా భారత్‌ అవతరించింది. దీంతో ఇక రెఫరెన్స్‌ ఇంధనం కోసం ఇతర దేశాలపై ఆధాపడాల్సిన అవసరం ఉండదు. 

మనం సాధారణంగా 1,000 కిలోలీటర్ల రెఫరెన్స్ ఇంధనం  దిగుమతి చేసుకుంటున్నామని, కానీ వినియోగం కేవలం 150 కిలోలీటర్లు మాత్రమేనని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. త్వరలో ఈ ఇంధనం దిగుమతులను ఆపివేసి, మనం కూడా ప్రధాన ఎగుమతిదారుగా మారనున్నామని ఆయన పేర్కొన్నారు.

ఏమిటీ రెఫరెన్స్‌ ఫ్యూయల్‌?
రెఫరెన్స్‌ ఫ్యూయల్‌ అనేది ఆటోమొబైల్ పరిశ్రమకు చాలా కీలకం.  వాహన తయారీదారులు, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT),  ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వంటి ఏజెన్సీలు వాహనాలను క్రమాంకనం చేయడానికి, పరీక్షించడానికి 'రిఫరెన్స్' ఇంధనాలను ఉపయోగిస్తాయి.

చాలా డబ్బు ఆదా
రెఫరెన్స్ ఇంధనాన్ని ఇండియన్ ఆయిల్ పారాదీప్ , పానిపట్ రిఫైనరీలు ఉత్పత్తి చేయనున్నాయి.  దిగుమతి చేసుకున్న రిఫరెన్స్ ఫ్యూయల్‌ లీటరు ధర రూ. 800 నుంచి రూ.850 ఉంటోంది. అదే మన దేశంలోనే ఉత్పత్తి చేయడం వల్ల లీటరు దాదాపు రూ. 500 లోపే వచ్చే అవకాశం ఉంటుంది.

మరిన్ని వార్తలు