రంగుల ఒలింపిక్స్‌ స్వప్నం

18 Oct, 2023 00:25 IST|Sakshi

ఎప్పటి నుంచో వింటున్నదే... తెర వెనుక జోరుగా ప్రయత్నాలు సాగుతున్నదే... ఇప్పుడు అధికారి కంగా ఖరారైంది. 128 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత క్రికెట్‌ మళ్ళీ విశ్వక్రీడల్లో పునఃప్రవేశం చేయనుంది. మరో అయిదేళ్ళలో రానున్న 2028 లాస్‌ ఏంజెల్స్‌ ఒలింపిక్స్‌లో ఈ ‘జెంటిల్మెన్‌ క్రీడ’ సహా స్క్వాష్, బేస్‌బాల్‌/ సాఫ్ట్‌బాల్, లక్రాస్, ఫ్లాగ్‌ ఫుట్‌బాల్‌ ఆటలు అయిదింటిని అదనంగా ప్రవేశపెట్టనున్నారు. భారత్‌లో 50 ఓవర్ల ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ జరుగుతున్న వేళ ఈ ప్రకటన రావడం విశేషం.

ముంబయ్‌లో 141వ అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) ప్రారంభ సమావేశంలో మాట్లాడుతూ, భారత్‌లో 2036 నాటి ఒలింపిక్స్‌ నిర్వహణకు మన ప్రధాని బాహాటంగా ఉత్సుకతను వ్యక్తం చేశారు. ఆ వెంటనే రెండు రోజులకే ఒలింపిక్‌ కార్యక్రమ సంఘం అధ్యక్షుడు కార్ల్‌ స్టాస్‌ క్రికెట్‌కు ఒలింపియాడ్‌లో స్థానాన్ని ప్రకటించడం ఉత్సాహం నింపింది. కాలానికి తగ్గట్టు మారే ఈ ప్రయత్నం అభినందనీయమే. అదే సమయంలో ఇది పలు సవాళ్ళపై చర్చ రేపింది. 

ఎప్పుడో 1900లోనే తొలిసారిగా ప్యారిస్‌ ఒలింపిక్స్‌లోనే క్రికెట్‌ భాగమైంది. తర్వాత ఇన్నేళ్ళకు లాస్‌ ఏంజెల్స్‌లో మళ్ళీ తెరపైకి వస్తోంది. స్క్వాష్‌ సహా మిగతా 4 ఆటలకు విశ్వ క్రీడాంగణంలో ఇదే తెరంగేట్రం. ప్రపంచంలోని అతి పెద్ద క్రీడా సంరంభం నుంచి ఇన్నేళ్ళుగా క్రికెట్‌ను దూరంగా ఉంచడం దురదృష్టకరమే! ఇప్పుడు టీ–20 క్రికెట్‌ విస్తృత ప్రాచుర్యం పొందడమే కాక మును పెన్నడూ లేని విధంగా ప్రపంచంలోని అనేక దేశాలు ఆ ఫార్మట్‌ పోటీల్లో పాల్గొంటున్నాయి.

ఈ నేపథ్యంలో టీ–20 క్రికెట్‌కు కూడా చోటివ్వడం ప్రజాస్వామ్యబద్ధమైన ఆలోచన. తద్వారా ఒలింపిక్స్‌ మరింత చేరువవుతుంది. ఫుట్‌బాల్‌ తర్వాత ప్రపంచంలో అత్యధికులు అనుసరించే క్రీడగా క్రికెట్‌ ప్రసార, ప్రచార హక్కులతో ఒలింపిక్‌ సంఘానికి వచ్చే ఆదాయం, అటు నుంచి భారత్‌కు లభించే వాటా సరేసరి. అందుకే, ఐఓసీ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక చాలా లెక్కలే ఉన్నాయి.   

అయితే చిన్న తిరకాసుంది. క్రికెట్‌ సహా కొత్తగా చేరే ఆటలన్నీ 2028 ఒలింపిక్స్‌కే పరిమితం. వాటిని తర్వాత కొనసాగించాలా లేదా అన్నది ఆపైన 2032లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చే బ్రిస్బేన్‌ నిర్ణయిస్తుంది. నిజానికి, కామన్వెల్త్‌ దేశాలే కాక, ప్రపంచమంతా ఆడే విశ్వక్రీడగా క్రికెట్‌ విస్తరించాల్సి ఉంది. ఐఓసీ గుర్తింపు పొందిన 206 దేశాల్లో ప్రస్తుతం 50 శాతాని కన్నా తక్కువ చోట్లే క్రికెట్‌ ఆడుతున్నారు.

కనీసం 75 శాతం చోట్ల క్రికెట్‌ తన ఉనికిని చాటాల్సి ఉంది. అది ఓ సవాలు. కొన్ని ఐఓసీ సభ్యదేశాలు చేస్తున్న ఈ వాదన సబబే. అలాగే, కొత్తగా ఒలింపియాడ్‌లోకి వస్తున్న అయిదింటిలో నాలుగు... టీమ్‌ స్పోర్ట్స్‌. కాబట్టి, క్రీడాగ్రామంలో ఆటగాళ్ళ సంఖ్య అంగీకృత కోటా 10,500 కన్నా 742 మేర పెరుగుతుంది. గేమ్స్‌ విలేజ్‌పై భారం తగ్గించడానికి ఇతర ఆటల్లో అథ్లెట్ల కోటా తగ్గించడం, కొన్ని మెడల్‌ ఈవెంట్లను ఈసారికి పక్కనపెట్టడమే మార్గం. అది కొంత నిరాశే! 

అలాగే, ఒలింపిక్స్‌లోకి క్రికెట్‌ పునఃప్రవేశం బాగానే ఉంది కానీ, అగ్ర క్రికెటర్లు ఆ క్రీడాసంరంభంలో కాలుమోపుతారా అన్న అనుమానం పీడిస్తోంది. ఇటీవలి ఏషియన్‌ గేమ్స్‌ అనుభవమే అందుకు సాక్ష్యం. ఆసియా ఖండంలోని అధిక భాగం అగ్రశ్రేణి జట్లు ప్రధాన ఆటగాళ్ళను అక్కడకు పంపనే లేదు. అదేమంటే, దగ్గరలోనే 50 ఓవర్ల ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ ఉందన్నాయి.

ఇండియా అయితే ఏషియాడ్‌కి క్రికెట్‌ జట్టునే పంపకూడదనుకుంది. ఆఖరు క్షణంలో క్రికెట్‌ బోర్డ్‌ మనసు మార్చుకుంది. వచ్చే 2028 నాటి అంతర్జాతీయ క్రికెట్‌ క్యాలెండర్‌ ఇంకా ఖరారు కాలేదు గనక, ఆ ఏడాది జూలైలో 16 రోజుల పాటు సాగే ఒలింపిక్స్‌లో అగ్రతారలు ఆడేందుకు వీలుగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) షెడ్యూల్‌ను ఖరారు చేస్తుందని ఒలింపిక్‌ సంఘం ఆశాభావంలో ఉంది. 

గతంలో యూ23 అవతారంలో ఒలింపిక్స్‌లో ఫుట్‌బాల్‌ ప్రయోగం చేశారు. కానీ, ఆదరణ, ఆదాయం అంతంతే! టెన్నిస్, గోల్ఫ్‌లను చేర్చుకున్నా, ప్రథమశ్రేణి పేర్లు కనపడలేదు. ఇక, వరు ణుడి కరుణపై ఆధారపడడం క్రికెట్‌కు మరో తలనొప్పి. తాజా ఏషియాడ్‌లో వాన వల్ల మ్యాచ్‌ రద్దయి, టీ20 ర్యాంకింగ్‌ను బట్టి స్వర్ణపతక విజేతను నిర్ణయించిన ప్రహసనం చూశాం.

ఇక, 2036 ఒలింపిక్స్‌ను భారత్‌లో నిర్వహించేలా సర్వశక్తులూ ఒడ్డుతామని మోదీ ప్రకటించడం సంతోషమే అయినా, సాధ్యాసాధ్యాలపై అనుమానాలున్నాయి. జీ20 సదస్సు, ఏషియాడ్‌లో పతకాల శతకం తెచ్చిన ఉత్సాహంలో ప్రధాని దీన్ని ‘140 కోట్ల ప్రజల స్వప్నం’గా పేర్కొన్నారు. కానీ, వేల కోట్లతో స్టేడియమ్‌లు నిర్మించేకన్నా సామాన్యులకు కూడుగూడుపై దృష్టి పెట్టాలనే వాదనని విస్మరించలేం.

భారీ ఖర్చు రీత్యా 2026 కామన్వెల్త్‌ గేమ్స్‌ నిర్వహించడానికి సైతం ఆస్ట్రేలియా చేతులెత్తేసింది. ఇక, 2010లో మన కామన్వెల్త్‌ గేమ్స్‌ నిర్వహణ అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది. అప్పట్లో భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌ను 14 నెలలు ఐఓసీ బహిష్కరించింది. అవన్నీ మనం మర్చి పోరాదు. 2035 నాటికి భారత్‌ 6 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికవ్యవస్థ అవుతుందనీ, 2047కి అగ్రరాజ్యంగా అవతరిస్తామనీ జబ్బలు చరుస్తున్న వేళ ఒలింపిక్స్‌ స్వప్నం వసతులు పెంచుకోవడానికీ, క్రీడా ప్రతిభను పెంచిపోషించుకోవడానికీ ఉపయుక్తమే! దాని వెంటే ఉన్న సవాళ్ళతోనే సమస్య.

తలసరి ఆదాయంలో మనల్ని ఎంతో మించిన లండన్, టోక్యో, ప్యారిస్, సియోల్‌లకున్న సహజ మైన సానుకూలత మనకుందా? సంబరం ముగిశాక ఏథెన్స్, రియో లాంటి ఆతిథ్య దేశాలకు ఐరావతాలుగా మారి క్రీడాంగణాల్ని వాడుకొనే ప్రణాళిక ఉందా? పేరుప్రతిష్ఠలతో పాటు ప్రజలకూ పనికొచ్చేలా వ్యూహరచన చేస్తేనే ఎంత రంగుల కలకైనా సార్థకత.  

మరిన్ని వార్తలు