వచ్చే ఏడాది కూడా వద్దు!

30 Jun, 2020 00:15 IST|Sakshi

ఒలింపిక్స్‌పై టోక్యో వాసుల అభ్యంతరం 

టోక్యో: ఈ ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌ను కరోనా మహమ్మారి మింగేసింది. చేసేది లేక వచ్చే ఏడాదికి వాయిదా వేశారు నిర్వాహకులు. కానీ టోక్యో వాసులు అప్పుడు కూడా వద్దంటున్నారు. కరోనాకు జడిసి... అది ఎక్కడ అంటుకుంటుందోనన్న భయాందోళనలు వారిని వెంటాడుతున్నాయి. అందుకేనేమో సగంమంది ప్రాణాలుంటే చాలు ఈ ఆటలెందుకని అనాసక్తి కనబరుస్తున్నారు. రీషెడ్యూల్‌ అయిన ఒలింపిక్స్‌పై రెండు జపాన్‌ వార్తా సంస్థలు జరిపిన అభిప్రాయ సేకరణలో 51.7 శాతం మంది టోక్యో వాసులు వచ్చే ఏడాది కూడా విశ్వ క్రీడలు వద్దంటున్నారు. ఆ సర్వేలో పోటీలకు వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు.

వారిలో చాలామంది మొత్తానికే రద్దయినా సంతోషమేనన్నారు. 27.7 శాతం మంది అభిప్రాయం అదే కాగా... 24 శాతం మాత్రం మరోసారి వాయిదా వేయాలని కోరుతున్నారు. ఆరోగ్య నిపుణులు ఏడాది వాయిదా సరిపోదని, వచ్చే ఏడాది కూడా ఏమాత్రం సురక్షితం కాబోదని చెప్పారు.  46.3 శాతం మంది మాత్రం తమ నగరంలో విశ్వక్రీడల్ని చూడాలనుకుంటున్నారు. ఇలా జరగాలన్న వారిలో 31.1 శాతం ప్రేక్షకుల్లేకుండా అయినా సరేనన్నారు. 15.2 శాతం మంది పూర్తిస్థాయిలో వీక్షకులు ఉండాల్సిందేనన్నారు. ఇది టెలిఫోన్‌ పోల్‌. ఈ నెల 26 నుంచి 28 వరకు నిర్వహించిన ఈ పోల్‌లో 1,030 మంది పాల్గొని తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు.

మరిన్ని వార్తలు