గంభీర్‌ నీకిది తగునా..?

27 Apr, 2018 15:42 IST|Sakshi
ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌

ఐపీఎల్‌ 11 సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ సారథిగా పగ్గాలు చేపట్టిన గౌతమ్‌ గంభీర్‌.. జట్టు వరుస పరాజయాలకు నైతిక బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ జట్టు యాజమాన్యం తన కోసం వెచ్చించిన 2.8 కోట్ల రూపాయలని కూడా తీసుకోకూడదని అతడు నిర్ణయించుకున్నాడు. జట్టు చెత్త ప్రదర్శన కారణంగా ఒక కెప్టెన్‌ ఈ విధంగా జీతం తీసుకోకుండా ఆడడం ఐపీఎల్‌ చరిత్రలో ఇదే మొదటిసారి. అయితే గౌతీ నిర్ణయం పట్ల అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్‌ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

‘గౌతమ్‌ గంభీర్‌ కెప్టెన్‌గా ఉన్నాడు గనుకే ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కి మద్దతు తెలిపాను. కానీ ఇప్పుడు అతడు కెప్టెన్‌గా వైదొలగాడు. నేను కూడా డీడీ టీమ్‌కు మద్దతు ఉపసంహరించుకుంటున్నాను’ అంటూ బాధను వ్యక్తం చేశాడు గౌతీ అభిమాని. ‘గౌతమ్‌ గంభీర్‌ సెల్యూట్‌... కానీ నీ నిర్ణయం మమ్మల్ని బాధ పెడుతోంది. అయినప్పటికీ నువ్వే బాస్‌’  అంటూ మరో అభిమాని ట్వీట్‌ చేశాడు.

‘నేను గంభీర్‌ వీరాభిమానిని కాదు. కానీ గంభీర్‌ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులు బాధాకరం. అసలు దీని వెనుక ఉన్న మతలబు ఏమిటో నాకు అర్థం కావడం లేదు. నేను గంభీర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా’ అంటూ ఓ నెటిజన్‌ అసహనాన్ని వ్యక్తం చేశాడు.

కాగా 2011 నుంచి ఏడు సీజన్ల పాటు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన గంభీర్‌ 2012, 2014లో జట్టును విజేతగా నిలిపాడు. ప్రస్తుతం సొంత జట్టుకు తిరిగొచ్చిన గౌతీ.. జట్టుకు విజయాలు అందించలేకపోయాడు. చెత్త ప్రదర్శన కారణంగా.. తనకు నాయకత్వ బాధ్యత నిర్వహించేందుకు సామర్థ్యం సరిపోవడం లేదని.. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం గంభీర్‌ స్థానంలో యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

మరిన్ని వార్తలు