కోహ్లి కోహినూర్‌ తీసుకురావా!

31 May, 2019 09:44 IST|Sakshi
ఎలిజబెత్‌ను కలిసిన కోహ్లి (బీసీసీఐ ట్విటర్‌ షేర్‌ చేసిన ఫొటో)

లండన్‌ : ప్రపంచకప్‌ ఆరంభానికి ముందు యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే) క్వీన్‌ ఎలిజబెత్‌ను టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో గురువారం జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో కోహ్లితో పాటు ఇతర జట్ల కెప్టెన్లు క్వీన్‌ ఎలిజబెత్‌ను కలిసారు. వారందరికీ ఆమె ‘బెస్ట్‌ విషెస్‌’ చెప్పారు.  ప్రిన్స్‌ హ్యారీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ భేటీ విషయాన్ని తెలియజేస్తూ సంబంధించిన ఫొటోలను రాయల్‌ ప్యాలెస్‌, బీసీసీఐలు ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నాయి. అయితే ఎలిజబెత్‌ను కోహ్లి కలవడంపై భారత అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

‘కోహ్లి ఎలిజబెత్‌ను కలిస్తే కలిసావు.. కానీ మన కోహినూర్‌ వజ్రం వారి దగ్గరే ఉంది. అది తీసుకురా’ అంటూ సెటైర్లేస్తున్నారు. ఇక ఎలిజబెత్‌, కోహ్లి మధ్య జరిగిన సంభాషణలను హాస్యంగా మలుస్తూ మీమ్స్‌ ట్రెండ్‌ చేస్తున్నారు. ‘ ఎలిజబెత్‌: బేటా ఏం కావాలి నీకు? కోహ్లి: కోహినూర్‌ కావాలి’ అనే క్యాప్షన్స్‌తో కామెంట్‌ చేస్తున్నారు.

ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రంగా పేరుగాంచిన కోహినూర్‌ వజ్రం భారత్‌కు చెందినది. కాకతీయుళు ఈ వజ్రాన్ని చేయించారని చరిత్ర చెబుతోంది. దీన్ని బ్రీటీష్‌ వాళ్లు తీసుకుపోవడంతో ప్రస్తుతం ఇది రాణి కిరిటంలో ఒదిగి ఉంది. దీన్ని సొంతం చేసుకున్న రాజులంతా రాజ్యాలు కోల్పోయారని, రాణులు మాత్రం తమ రాజ్యాలను విస్తరింపజేశారనే ప్రచారం ఉంది. ఈ కారణంగా కోహినూర్‌ వజ్రం ఆడవారికి అదృష్టం, మగవారికి అరిష్టమనే ప్రచారం సాగుతుంది. ప్రపంచంలోని వజ్రాలలోకెల్లా కాంతివంతమైన కోహినూర్‌ను తిరిగి ఇవ్వాల్సిందిగా భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు.

ప్రపంచకప్‌ సమరం గురువారం ఇంగ్లండ్‌-దక్షిణాఫ్రికాతో ఆరంభం కాగా.. భారత్‌ జూన్‌ 5న అదే దక్షిణాఫ్రికాతో సౌతాంప్టన్‌ వేదికగా తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఇప్పటికే రెండు సార్లు(1983, 2011) ఈ మెగా టైటిల్‌ సొంతం చేసుకున్న టీమిండియా.. మూడోసారి కప్పును ముద్దాడాలని ఉవ్విళ్లూరుతోంది.

మరిన్ని వార్తలు