అందుకే కోహ్లి విశ్రాంతి తీసుకోలేదు!

23 Jul, 2019 20:26 IST|Sakshi
విరాట్‌ కోహ్లి

న్యూఢిల్లీ : ప్రపంచకప్‌ నిష్క్రమణ అనంతరం భారత జట్టులో గ్రూపు తగాదాలున్నాయనే ఊహాగానాలు వెలువడిన విషయం తెలిసిందే. ప్రధానంగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చెరో క్యాంప్‌ నడుపుతున్నారనే పుకార్లు హల్‌చల్‌ చేసాయి. కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్‌ శర్మకు ఇవ్వాలనే డిమాండ్‌ కూడా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే ఇండియాకు ఇద్దరి కెప్టెన్లను తీసుకొచ్చే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు... కోహ్లి కెప్టెన్సీని టెస్ట్‌లకే పరిమితం చేస్తూ లిమిటెడ్‌ ఓవర్ల ఫార్మాట్‌ బాధ్యతలను రోహిత్‌కు ఇవ్వనున్నట్లు ప్రచారం కూడా జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే అభద్రతాభావానికి లోనైన కోహ్లి.. విశ్రాంతిని కాదనుకొని వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్తున్నాడనే మాటలు వినిపించాయి.

అయితే ఇవన్నీ తప్పుడు మాటలేనని బీసీసీఐ సన్నిహిత వర్గాలు తెలిపినట్లు టౌమ్స్‌నౌ పేర్కొంది. ప్రపంచకప్‌ ఓటమి అనంతరం ఆత్మవిశ్వాసం కోల్పోయిన జట్టును వీడి విశ్రాంతి తీసుకోవడం కెప్టెన్‌గా భావ్యం కాదని భావించే కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. ‘ప్రపంచకప్‌ నిష్క్రమణ అనంతరం జట్టు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో ఉన్న జట్టును విండీస్‌ పర్యటనకు పంపించడం భావ్యం కాదని, ఆటగాళ్లలో సానుకూల ధృక్పథం తీసుకురావాలని భావించాడు. ప్రపంచకప్‌ ఓటమి జట్టులో ప్రతి ఒక్కరిని బాధపెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో జట్టుకు దూరంగా ఉండటం కన్నా జట్టుతో ఉండడమే ఓ కెప్టెన్‌ కర్తవ్యమని కోహ్లి భావించాడు.’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్టు 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు వెస్టిండీస్‌లో పర్యటించనున్న భారత జట్లను బీసీసీఐ ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. మూడు ఫార్మాట్‌లకు కోహ్లినే కెప్టెన్‌గా కొనసాగించింది.

మరిన్ని వార్తలు