సవాళ్ల  సమరం 

22 May, 2019 00:28 IST|Sakshi

ఈ ప్రపంచ కప్‌ చాలా క్లిష్టమైనది

పరిస్థితులు కాదు... ఒత్తిడిని ఎదుర్కొనడమే ప్రధానం

దేశ సైనికులే మాకు స్ఫూర్తి 

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి

నేడు ఇంగ్లండ్‌  బయలుదేరనున్న జట్టు

వంద కోట్లకు పైగా అభిమానుల ఆకాంక్షల్ని  భుజాలకెత్తుకుని... తమ సామర్థ్యంపై పూర్తి భరోసాతో...  చెక్కుచెదరని సంకల్పంతో... ప్రత్యర్థుల పని పట్టేందుకు... కొండంత ఆత్మవిశ్వాసంతో ప్రపంచ కప్‌ వేటకు  బయల్దేరుతోంది భారత క్రికెట్‌ జట్టు. సుదీర్ఘ ఫార్మాట్‌ అయినా... ఎక్కడా తగ్గకుండా శక్తిమేర ఆడతామంటున్నాడు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి. ఈ క్రమంలో తమ బలగంపై ధీమా వ్యక్తం చేశాడు. బుధవారం ముంబై నుంచి ఇంగ్లండ్‌కు  బయలుదేరనున్న నేపథ్యంలో మంగళవారం కోచ్‌ రవిశాస్త్రితో కలిసి కోహ్లి మీడియాతో మాట్లాడాడు. కప్‌లో ఎదురవ్వనున్న  పరిస్థితులు ... జట్టు సన్నాహాలు... ఆటగాళ్ల సంసిద్ధత  తదితరాలపై స్పష్టంగా జవాబులిచ్చాడు.   

ముంబై: ప్రపంచ కప్‌ జరుగబోయే ఇంగ్లండ్‌లోని   పరిస్థితుల కంటే మ్యాచ్‌ల సందర్భంగా ఒత్తిడిని ఎలా తట్టుకొంటామనేదే అసలైన సవాలని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. మన శక్తియుక్తులను సరి చూసుకునేందుకు ప్రతిష్టాత్మక టోర్నీకి కొంచెం ముందుగా వెళ్లడం ఎప్పుడైనా మంచిదేనని అతడు పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరూ మొదటి మ్యాచ్‌ నుంచే అత్యుత్తమంగా ఆడాలని, ఈ విషయంలో ఎలాంటి మినహాయింపు లేదని వివరించాడు. ‘ఎరుపు బంతితో ఆడే టెస్టులతో పోలిస్తే... తెల్ల బంతితో సాగే వన్డేలు, ఇంగ్లండ్‌లో ఆడటం, ఐసీసీ ఈవెంట్‌ ఇవన్నీ భిన్నమైవని, పెద్ద కష్టమైనవేమీ కాదు’ అని విశ్లేషించాడు. మీడియా సమావేశంలో కోహ్లి వెల్లడించిన అభిప్రాయాలు అంశాల వారీగా అతడి మాటల్లోనే.... 

ఐపీఎల్‌ వైఫల్యం... 
ఐపీఎల్‌–12లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వరుస పరాజయాలతో మేం ఓ విషయమై అంగీకారానికి వచ్చాం. అదేమంటే... ‘ఇలా ఏ జట్టుకూ ఎప్పుడూ జరగలేదని’. ఒక దశ తర్వాత మన చేతుల్లో ఏమీ ఉండదనే వాస్తవంలో ఆలోచిస్తూ దానిని అంగీకరించాలి. లీగ్‌ మొదటి భాగంలో ఇది అనుభవమైంది. రెండో భాగంలో పరిస్థితులు మారాయి. మొత్తానికి నాకు అనుభవమైనది ఏమంటే... తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ ఉన్నప్పటికీ ఇలా జరగకూడదు, అలా చేయాలని అంటూ ముందు రోజే గదిలో కూర్చుని తీవ్రంగా ఆలోచించకూడదని.  

వారిద్దరూ మా మూలస్తంభాలు 
ఐపీఎల్‌లో ఆకట్టుకోలేకపోయిన కుల్దీప్‌ యాదవ్‌కు లోపాలు సరిచేసుకుని ప్రపంచ కప్‌ బరిలో దిగేందుకు సమయం దొరికింది. అతడు, చహల్‌   మా జట్టు మూల స్తంభాలు. కుల్దీప్‌ గతంలో విశేషంగా రాణించాడు. ఐపీఎల్‌లో అతడికి కలిసిరాలేదు. ఇలాంటి సందర్భం ప్రపంచ కప్‌లో కాకుండా లీగ్‌లో ఎదురవడం మంచిదే అనుకోవాలి. జాదవ్‌ కూడా పూర్తిగా సిద్ధమయ్యాడు. టి20ల్లో పరుగులు సాధించకున్నా పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కేదార్‌ జాదవ్‌ గురించి కూడా ఎలాంటి ఆందోళన లేదు. 

వరుసగా పెద్ద మ్యాచ్‌ల గురించి 
కొంత సవాలే అయినా, ఆటగాళ్లకు ఇబ్బంది లేకుండా, ఉత్తేజంగా ఉండటానికి ప్రతి మ్యాచ్‌కు మధ్య చక్కటి వ్యవధి దొరికింది. తద్వారా తీవ్ర ఒత్తిడితో సాగిన మ్యాచ్‌ల ప్రభావం నుంచి బయటపడొచ్చు. వరుసగా నాలుగు పెద్ద జట్లతో మ్యాచ్‌లు ఉన్నందున... అలసత్వానికి తావు లేకుండా అంతా సర్దుకుంటుంది. మ్యాచ్‌కు వంద శాతం సిద్ధమయ్యామా? బరిలో దిగామా? అనేది అసలైన చాలెంజ్‌. 

సైనికులే స్ఫూర్తి 
ప్రపంచ కప్‌ కోసం మీరు ఎక్కడి నుంచైనా స్ఫూర్తి పొందవచ్చు. ఈ విషయంలో మాకు భారత సైన్యం కంటే పెద్ద స్ఫూర్తిదాయకం ఏదీ ఉండదు. సైనికులకు కప్‌ను అంకితం ఇవ్వాలనుకుంటే అంతకంటే మెరుగైన అంశం ఏదీ ఉండదు.  పాకిస్తాన్‌ జట్టుతో మ్యాచ్‌ గురించి ప్రత్యేకంగా ఆలోచించడం లేదు. ఒక్కో జట్టు గురించి ఇలా లోతుగా ఆలోచిస్తూ పోతే... మా ప్రయాణంలో అసలు లక్ష్యంపై పూర్తి దృష్టి పెట్టలేం. 

సుదీర్ఘ షెడ్యూల్‌పై 
ప్రపంచంలోని అత్యుత్తమ ఫుట్‌బాల్‌ క్లబ్‌లను తీసుకోండి. ప్రీమియర్‌ లీగ్‌ కానీ, లా లీగా కానీ మూడు, నాలుగు నెలలపాటు వారు ఒకే తీవ్రతతో ఆడుతుంటారు. మనం ఒకసారి అలాంటి వాతావరణంలోకి వెళ్లి, ఆ నిలకడ కొనసాగిస్తూ పోతే భారీ షెడ్యూల్‌ ఇబ్బందేం కాదు. 

260–270 స్కోర్లూ ఉండొచ్చు 
వేసవి కావడంతో అక్కడి పిచ్‌లు బ్యాటింగ్‌కు బాగా అనువుగా ఉంటాయి. మేం కూడా భారీ స్కోర్లను ఆశిస్తున్నాం. కానీ అది (ఇటీవలి ఇంగ్లండ్‌–పాక్‌ సిరీస్‌ను ఉద్దేశించి) ద్వైపాక్షిక సిరీస్‌. ప్రపంచ కప్‌ భిన్నంగా ఉంటుంది. ఒత్తిడి వాతావరణంలో 260–270 స్కోర్లు నమోదై... వాటిని కాపాడుకునే మ్యాచ్‌లూ ఉండొచ్చు.  

అంచనాలు
ప్రపంచ కప్‌ కాబట్టి మా జట్టుపై ఇలాంటి ఒత్తిడి ఉంటుందని ఊహించాం. అయినా వెనక్కు తగ్గం. మైదానంలో దిగిన మొదటి క్షణం నుంచే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలన్నదే మా మీద మాకున్న ఏకైక అంచనా. దానిని అనుసరించే ఫలితాలు వస్తాయి. ప్రతి మ్యాచ్‌లో మా సామర్థ్యానికి తగిన ప్రతిభ కనబరుస్తామని గట్టిగా నమ్ముతున్నాం. 

ఈ ప్రపంచ కప్‌ ఫార్మాట్‌పై... 
ప్రతి జట్టు ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడే రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ ఫార్మాట్‌ అందరికీ బాగుంటుంది. ప్రతిభా పాటవాలరీత్యా చూస్తే నేను ఆడబోతున్న ఈ మూడో ప్రపంచ కప్‌ మిగతా అన్నింటికంటే చాలా క్లిష్టమైనది. ఎందుకంటే... కాలం కలిసొచ్చిన రోజు ఏ జట్టు ఏ జట్టునైనా ఓడించవచ్చు. అఫ్గానిస్తాన్‌నే తీసుకోండి. గత నాలుగేళ్లలో ఆ జట్టు ఎంతో ఎదిగింది. 

బౌలర్లు మానసికంగా సిద్ధం 
ఐపీఎల్‌ సందర్భంగానే... తాము 50 ఓవర్ల మ్యాచ్‌ ఆడుతున్నంతగా జట్టులోని బౌలర్లు మానసికంగా సిద్ధమైపోయారు. నాలుగు ఓవర్లు వేసిన తర్వాత ఏ ఒక్కరూ అలసిపోలేదు. ఐపీఎల్‌లో పాల్గొన్న భారత ఆట గాళ్లంతా తాజాగా ఉన్నారు. అంతిమ ధ్యేయం 50 ఓవర్ల ఫార్మాట్‌కు ఫిట్‌గా ఉండటమే అని లీగ్‌ ప్రారంభానికి ముందే వారికి సమాచారం ఇచ్చాం. 

ధోని పాత్ర ఎంతో కీలకం 
కీపర్‌గా చక్కటి క్యాచ్‌లు అందుకోవడం, చురుకైన రనౌట్లు, మెరుపు స్టంపింగ్‌లతో మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి కెప్టెన్‌ కోహ్లితో సమన్వయంలో సరితూగే వారు లేరు. మ్యాచ్‌ ఫలితాన్ని మార్చేసేవి ఇవే. ఈ ఐపీఎల్‌లో సారథ్యంలో, బ్యాటింగ్‌లో అతడి విలువేంటో చూశాం. ప్రపంచ కప్‌లో తన పాత్ర ఎంతో కీలకం. ప్రపంచంలో ఎక్కడైనా సరే త్వరగా అలవాటు పడొచ్చేమో కానీ ఇంగ్లండ్‌లో అలా కాదు. వాతావరణానికి తగ్గట్లు మారిపోవడమే మేం పాటించనున్న మంత్రం. కొత్తగా ఏమీ చేయాల్సిన పని లేదు. అదే నిలకడ కొనసాగిస్తే చాలు. గత ఐదేళ్లుగా ఇదే జట్టు అద్భుతంగా ఆడుతోంది. ప్రధాన బౌలర్లు కావల్సినంత అనుభవం సంపాదించారు. టెస్టుల్లోలాగానే ఇప్పుడూ విజయవంతం అవుతారు. ప్రపంచ కప్‌ అందరికీ చక్కటి అవకాశం. మన శక్తి మేర ఆడితే కప్‌ సొంతమవుతుంది.  
–రవిశాస్త్రి, భారత జట్టు హెడ్‌ కోచ్‌ 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తొలి బంగ్లాదేశ్‌ క్రికెటర్‌గా..

వరల్డ్‌కప్‌ నుంచి ఆండ్రీ రసెల్‌ ఔట్‌

షైనీకి పిలుపు.. ఇంగ్లండ్‌కు పయనం

అయ్యో.. ఇంగ్లండ్‌

‘కొంతమంది నోళ్లు మూయించాం’

‘ప్రపంచ క్రికెట్‌లో నయా ధోని’

అతని కోసం ప్రణాళిక సిద్ధం చేశాం: చహల్‌

అఫ్గాన్‌కు ఎక్కువ సీన్‌ ఇచ్చారు: మాజీ క్రికెటర్‌

బంగ్లాదేశ్‌ను నిలువరించేనా?

మేం మునిగాం.. బంగ్లానూ ముంచుతాం

పాక్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌!

అంతా ఐపీఎలే చేసింది : డూప్లెసిస్‌

వైరల్‌: భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో గెలిచిన ‘ప్రేమ’

బ్రాత్‌వైట్‌ సెంచరీతో పోరాడినా...

ఇది క్లిష్టమైన విజయం

పాకిస్తాన్‌ గెలిచింది...

మూడో పాక్‌ క్రికెటర్‌గా..

సర్ఫరాజ్‌ భయపడ్డాడా?

చెలరేగిన సొహైల్‌.. దక్షిణాఫ్రికా లక్ష్యం 309

ఇమ్రాన్‌ తాహీర్‌ ‘వరల్డ్‌కప్‌’ రికార్డు

ఒకే స్కోరు.. ఒకే బౌలర్‌

వెల్‌డన్‌ బ్రాత్‌వైట్‌.. బాగా ఆడావ్‌!

అందుకు కారణం అతనే: షమీ

విరాట్‌ కోహ్లికి జరిమానా

పాకిస్తాన్‌ గెలిస్తేనే..!

కోహ్లి నీ కెప్టెన్సీ సూపరో సూపర్‌!

మాజీ ఆటగాళ్లపై సర్ఫరాజ్‌ ఫైర్‌!

షమీ హ్యాట్రిక్‌ క్రెడిట్‌ ధోనిదే!