-

గంగూలీ, యువరాజ్‌ సరసన విరాట్‌

2 Nov, 2018 12:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇప్పటికే పలు అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో ఘనత సాధించాడు. అద్భుతమైన ఆటతీరుతో పరుగుల వరద పారిస్తున్న విరాట్‌.. వెస్టిండీస్‌తో జరిగిన అయిదు వన్డేల సిరీస్‌లో మూడు సెంచరీలు సాధించి (453 రన్స్‌) ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా ఎంపికయ్యాడు. తద్వారా వన్డే క్రికెట్‌లో 7 ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు సొంతం చేసుకున్న ఆటగాడిగా విరాట్‌ నిలిచాడు. గతంలో ఈ ఘనత సాధించిన టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ, యువరాజ్‌ సింగ్‌, వివ్‌ రిచర్డ్ష్‌, రికీ పాంటింగ్‌, హషీం ఆమ్లా సరసన చేరాడు. (చదవండి : ముగింపు అదిరింది)

కాగా, ఈ కేటగిరిలో 15 ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు సాధించి మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తొలి స్థానంలో నిలవగా.. 11 అవార్డులతో సనత్‌ జయసూర్య, 9 అవార్డులతో షాన్‌ పొల్లాక్‌ తరువాతి స్థానాల్లో ఉన్నారు. తాజా వన్డే సిరీస్‌లో విరాట్‌ కోహ్లి మొదటి మ్యాచ్‌లో 140, రెండో మ్యాచ్‌లో 157, మూడో మ్యాచ్‌లో 107 పరుగులు చేసిన విషయం తెలిసిందే. 

ఇక గురువారం కేరళలోని గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన చివరిదైన 5 వన్డేలో భారత్‌  9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు వన్డేల సిరీస్‌ను 3–1తో సొంతం చేసుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న విండీస్‌ 31.5 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ జేసన్‌ హోల్డర్‌ (33 బంతుల్లో 25; 2 ఫోర్లు), మార్లోన్‌ శామ్యూల్స్‌ (38 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఓ మాదిరిగా ఆడగా, జట్టులో ఎనిమిది మంది కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రవీంద్ర జడేజా (4/34) ముందుండి నడిపించగా, మిగతా నలుగురు బౌలర్లూ కనీసం ఒక మెయిడిన్‌ ఓవర్‌తో పాటు కనీసం ఒక వికెట్‌ తీయడం గమనార్హం. అనంతరం భారత్‌ 14.5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 105 పరుగులు చేసి సునాయాసంగా విజయాన్ని అందుకుంది.

మరిన్ని వార్తలు