ఈ విజయం అసామాన్యమైనది : సెహ్వాగ్‌

13 Jul, 2018 10:51 IST|Sakshi
స్వర్ణ పథకంతో హిమ దాస్‌

ప్రపంచ అండర్- 20 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన భారత క్రీడాకారిణి హిమ దాస్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. హిమ దాస్‌ను ప్రశంసిస్తూ.. ‘వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన హిమకు శుభాకాంక్షలు. అస్సాం, భారత్‌కు నువ్వు గర్వకారణం. ఇక ఒలంపిక్‌ మెడల్‌ సాధించే దిశగా కృషి చేయాలి’  అంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ట్వీట్‌ చేశారు.

బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ కూడా.. ‘మమ్మల్ని గర్వంతో తలెత్తుకునేలా చేశావంటూ’ హిమను ప్రశసించారు. ఇక ట్విటర్‌ ఫన్నీమ్యాన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌... ‘చాలా గర్వంగా ఉంది. నీ విజయం అసామాన్యమైనది. స్వర్ణ పతకం సాధించి మాకు సంతోషాన్ని పంచినందుకు ధన్యవాదాలు’  అంటూ ట్వీట్‌ చేశారు. తనకు మద్దతుగా నిలిచిన భారత ప్రజలందరికీ హిమ దాస్‌ ధన్యవాదాలు తెలిపారు.

కాగా అసోంలోని నాగావ్‌కు చెందిన 18 ఏళ్ల హిమ ఇటీవల గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో 400 మీటర్ల పరుగులో ఆరో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఫిన్లాండ్‌లోని టాంపెరెలో జరిగిన ఈవెంట్‌లో 400 మీటర్ల పరుగులో 51.46 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణ పతకం గెలుచుకున్నారు. తద్వారా ఐఏఏఎఫ్‌ వరల్డ్‌ ట్రాక్‌ ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా హిమ చరిత్ర సృష్టించారు.

మరిన్ని వార్తలు