వాలీబాల్‌ కురువృద్ధుడు కోదండరామయ్య అస్తమయం

21 Dec, 2018 04:22 IST|Sakshi

విశాఖ స్పోర్ట్స్‌: ప్రముఖ వాలీబాల్‌ క్రీడాకారుడు, క్రీడా కురువృద్ధుడు కోదండరామయ్య (81) గురువారం తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయన అస్వస్థతకు గురయ్యారు. స్థానిక ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో మృతిచెందారు. ఆయన వాలీబాల్‌ క్రీడాకారునిగానే కాకుండా  శిక్షకునిగా, వాలీబాల్‌ సంఘం ప్రతినిధిగా క్రీడాభిమానులకు సుపరిచితులు. నందిగామలోని సెనగపాడుకు చెందిన కోదండరామయ్యను తల్లిదండ్రులు క్రీడల వైపు ప్రోత్సహించారు. గుంటూరు లయోలా కళాశాలలో ఇంటర్, ఉస్మానియా వర్సిటీలో డిగ్రీ  అభ్యసించారు.

1958లో బుచ్చిరామయ్య వద్ద వాలీబాల్‌లో ఓనమాలు నేర్చుకుని ఏడాదిలోనే ఆంధ్ర జట్టు సభ్యుడయ్యారు. చేరి మరో మూడేళ్లలో (1962) జట్టుకు నాయకత్వం వహించారు. 1963లో పటియాలాలోని భారత క్రీడా శిక్షణా సంస్థలో డిప్లొమా అందుకున్న ఆయన 1970లో జర్మనీలో డిప్లొమా చేశారు. 1971లో ఆంధ్ర విశ్వకళాపరిషత్‌లో వాలీబాల్‌ శిక్షకునిగా బాధ్యతలు చేపట్టారు.1982 నుంచి 2015 వరకు ఆంధ్రప్రదేశ్‌ వాలీబాల్‌ సంఘానికి అధ్యక్షునిగా సుదీర్ఘ కాలం సేవలందించారు. అవిభాజ్య ఏపీలో వాలీబాల్‌ క్రీడ అభివృద్ధి చెందడంలో కోదండరామయ్య కీలక పాత్ర పోషించారు. ఆయనకు భార్య అనసూయాదేవి, కుమారుడు శ్రీధర్, కుమార్తె జానకి ఉన్నారు. 

మరిన్ని వార్తలు