అది ధోనిపై వేసిన జోక్‌ మాత్రమే: లక్ష్మణ్‌

18 Nov, 2018 18:02 IST|Sakshi

హైదరాబాద్‌: అంతర్జాతీయ క్రికెట్‌లో సాగిన 16 ఏళ్ల కెరీర్‌లో స్టయిలిష్‌ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఎప్పుడూ వివాదాల జోలికి పోలేదు. జెంటిల్‌మన్‌ క్రికెటర్‌గానే ఆటను ముగించాడు. వీవీఎస్‌ లక్ష్మణ్‌ అనగానే అందరికీ కోల్‌కతా 281 ఇన్నింగ్స్‌ గుర్తుకు వస్తుంది కాబట్టి దానిని టైటిల్‌గా పెట్టి ఒక పుస్తకాన్ని తీసుకొచ‍్చాడు లక్ష్మణ్‌. ఇందులో గతంలో ఎంఎస్‌ ధోనితో ఏర్పడిన వివాదాల గురించి స్పష్టతనిచ్చాడు. తనకు ధోనితో ఎటువంటి విభేదాలు లేవని పుస్తకంలో పేర్కొన్నాడు. తన ఆకస్మిక రిటైర్మెంట్‌ వెనుకు ధోని పాత్ర ఎంతమాత్రం లేదన్నాడు.  దీనికి సంబంధించి ‘281 అండ్‌ బియాండ్‌’ పుస్తకంలో ఆనాటి విషయాలను పేర్కొన్నాడు.  

‘నా రిటైర్మెంట్‌ నిర్ణయంపై ముందుగా మీడియాకు తెలిపా. ఆ క్రమంలో మీడియా నుంచి కొన్ని ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. టీమ్‌ సభ్యులకు సమాచారం ఇచ్చారా. ప్రధానంగా జట్టు కెప్టెన్‌గా ఉన్న ధోనికి తెలిపారా?’ అని మీడియా మిత్రులు అడిగారు. ఆ సమయంలో జట్టు సభ్యులకు తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని చెప్పినా, ధోనికి చెప్పలేదని పరోక్షంగా వారికి తెలియజేశా. ఆ క్రమంలోనే ధోనిని చేరుకోవడం ఎవరికైనా చాలా  కష్టం అని వ్యాఖ్యానించా. అది ధోనిపై వేసిన జోక్‌ మాత్రమే. దానికి ధోనితో వివాదం అని ముడిపెట్టారు. నా రిటైర‍్మెంట్ సంబంధించి ధోనిని ఎప్పుడూ విమర్శించలేదు. నా క్రికెట్‌ కెరీర్‌లో వివాదం ఏదైనా ఉందంటే అదే మొదటిది.. చివరిది కూడా’ అని పుస్తకంలో లక్ష్మణ్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు