నాయినికి షాకిచ్చిన కేసీఆర్‌!

18 Nov, 2018 17:45 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ తుది జాబితా విడుదల

కోదాడ, ముషీరాబాద్‌ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన కేసీఆర్‌

నాయిని అల్లుడికి దక్కని చోటు

సాక్షి, హైదరాబాద్‌ : ముషీరాబాద్ టికెట్‌ను తన అల్లుడికి కేటాయించాలని కోరిన హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి గులాబీ అధినేత కేసీఆర్‌ మొండిచేయి చూపారు. ఆ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ నేత ముఠా గోపాల్‌కు కేటాయిస్తున్నట్లు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. అలాగే కోదాడ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఇటీవల టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన మల్లయ్య యాదవ్‌కు కేటాయించారు.  

ముషీరాబాద్‌ స్థానాన్ని తన అల్లుడు శ్రీనివాసరెడ్డికి కేటాయించాలని మంత్రి నాయిని మొదటి నుంచి పట్టుబట్టారు. అయితే, అక్కడ ముఠా గోపాల్ అయితేనే.. ప్రభావం చూపగలరని పార్టీ సర్వేలో వెల్లడైందని, అందుకే గోపాల్‌కు ఆ సీటు కేటాయించామని కేసీఆర్‌ వివరించినట్లు సమాచారం. ఆ స్థానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, కాంగ్రెస్‌ నుంచి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పోటీ చేస్తున్న నేపథ్యంలో గట్టి పోటీ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే  ముఠా గోపాల్‌కు ఆ స్థానాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది.

ఇక కోదాడ సీటు గత శుక్రవారమే పార్టీలో చేరిన బొల్లం మల్లయ్య యాదవ్‌కు ఖరారు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతి పోటీ చేస్తున్న కోదాడలో గట్టి పోటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో బొల్లం మల్లయ్య యాదవ్‌కు ఆ స్థానాన్ని కేటాయించారు.

బర్కత్ పురాలో సోమవారం ఉదయం జరిగే కార్యక్రమంలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేతుల మీదుగా ముషీరాబాద్ టిఆర్ఎస్ బిఫామ్ ను ముఠా గోపాల్ తీసుకోనున్నారు. నాయిని ఆశీర్వాదం తీసుకుని సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్ రావు ఆధ్వర్యంలో కోదాడ అభ్యర్థిగా బొల్లం మల్లయ్య యాదవ్ సోమవారం నామినేషన్ దాఖలు చేయన చేస్తారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు