లారా రికార్డును బ్రేక్‌ చేసే సత్తా అతనికే ఉంది: వార్నర్‌

1 Dec, 2019 13:46 IST|Sakshi

లారా రికార్డుపై వార్నర్‌ నోట భారత క్రికెటర్‌ మాట..

అడిలైడ్‌: పాకిస్తాన్‌తో రెండో టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అజేయంగా 335 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. దాంతో ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 589 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ క్రమంలోనే ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ డిక్లేర్డ్‌ చేశాడు. ఫలితంగా పైన్‌ తీవ్రంగా ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు. టెస్టు క్రికెట్‌లో వెస్టిండీస్‌ దిగ్గజ ఆటగాడు బ్రియాన్‌ లారా నెలకొల్పిన 400 పరుగుల అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును వార్నర్‌ సాధించే అవకాశం ఉన్నా పైన్‌ నిర్ణయంతో అది చేజారిపోయిందని సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ మొదలైంది. దీన్ని వార్నర్‌ మాత్రం లైట్‌గానే తీసుకున్నాడు. జట్టు ప‍్రయోజనాల కంటే కూడా ఏదీ ముఖ్యం కాదన్నాడు. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కల్గించే అవకాశం ఉండటంతో ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేయాల్సి వచ్చిందన్నాడు. అదే సమయంలో పాకిస్తాన్‌ను  సాధ్యమైనంత తొందరగా కట్టడి చేసి మ్యాచ్‌పై పట్టు సాధించాలనే ఉద్దేశంతోనే పైన్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేశాడన్నాడు.

వార్నర్‌ నోట.. భారత క్రికెటర్‌ మాట
అయితే లారా నాలుగు వందల టెస్టు పరుగుల రికార్డుపై వార్నర్‌కు ఒక ప్రశ్న ఎదురుకాగా, అందుకు భారత క్రికెటర్‌ను ఎంచుకున్నాడు. లారా రికార్డును బ్రేక్‌ చేసే సత్తా భారత క్రికెటరైన రోహిత్‌ శర్మకే ఉందన్నాడు. ఏదో ఒక రోజు రోహిత్‌ శర్మ ఆ రికార్డును బ్రేక్‌ చేస్తాడన్నాడు. అది తప్పక జరుగుతుందని ధీమా వ్యక్తం చేశాడు.  ఇక ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తరపున సెహ్వాగ్‌ కలిసి ఆడిన అనుభవాన్ని వార్నర్‌ పంచుకున్నాడు. ‘ నా పక్కనే కూర్చొన్న సెహ్వాగ్‌ మాట్లాడుతూ తాను టీ20ల కంటే టెస్టులే బాగా ఆడతానని చెప్పాడు. ఆ సమయంలో దాన్ని మీ మనసులోంచి తొలగించమని చెప్పాను.

నేను ఎక్కువ ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడలేదని విషయాన్ని సెహ్వాగ్‌కు చెప్పా’ అని వార్నర​ తెలిపాడు. తనకు సెహ్వాగ్‌ ఒకే విషయం ఎక్కువగా చెబుతూ ఉండేవాడన్నాడు. ‘ స్లిప్‌, గల్లీ, కవర్స్‌, మిడ్‌ వికెట్‌, మిడాఫ్‌, మిడాన్‌లలో ఫీల్డర్లు ఉంటారు. వారిపై నుంచి షాట్లను రోజంతా ఆడొచ్చు అనే విషయం చెప్పేవాడు. ఇదే నా మనసులో పాతుకుపోయింది. దాంతోనే టెస్టు క్రికెట్‌లో రాణిస్తున్నా’ అని వార్నర్‌ తెలిపాడు.

మరిన్ని వార్తలు