విదర్భ జోరు కొనసాగేనా?

12 Feb, 2019 00:04 IST|Sakshi

రెస్టాఫ్‌ ఇండియాతో  నేటి నుంచి ఇరానీ కప్‌ మ్యాచ్‌  

నాగ్‌పూర్‌: ఈ సీజన్‌ రంజీ ట్రోఫీ విజేత, డిఫెండింగ్‌ చాంపియన్‌ విదర్భ... ఇరానీ కప్‌ కోసం నేటి నుంచి రెస్టాఫ్‌ ఇండియా జట్టుతో తలపడనుంది. ఐదు రోజుల మ్యాచ్‌లో రెస్టాఫ్‌ ఇండియాకు టీమిండియా బ్యాట్స్‌మన్‌ అజింక్య రహానే సారథ్యం వహిస్తాడు. ప్రపంచ కప్‌నకు పరిశీలనలో ఉన్నట్లు తేలిన నేపథ్యంలో రహానే ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. మయాంక్‌ అగర్వాల్, శ్రేయస్‌ అయ్యర్, హనుమ విహారి వంటి ప్రతిభావంతులైన బ్యాట్స్‌మెన్‌తో రెస్టాఫ్‌ ఇండియా జట్టు బలంగా ఉంది. బౌలింగ్‌లో మాత్రం అనుభవ లేమి కనిపిస్తోంది. పేసర్లు అంకిత్‌ రాజ్‌పుత్, తన్వీర్‌ ఉల్‌ హక్, సందీప్‌ వారియర్, స్పిన్నర్లు ధర్మేంద్ర జడేజా, కృష్ణప్ప గౌతమ్‌ ప్రత్యర్థిని ఏ మేరకు కట్టడి చేస్తారో చూడాలి.

ఇక సమష్టి కృషితో వరుసగా రెండోసారి రంజీ ట్రోఫీ గెలిచిన ఊపులో ఉన్న విదర్భ... గతేడాదిలాగే ఇరానీ కప్‌నూ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. గాయం కారణంగా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ దూరమైనా, అటు బ్యాటింగ్‌లో కెప్టెన్‌ ఫైజ్‌ ఫజల్, వెటరన్‌ వసీం జాఫర్, సంజయ్‌ రామస్వామి, ఇటు బౌలింగ్‌లో రజనీశ్‌ గుర్బానీ, స్పిన్నర్‌ ఆదిత్య సర్వతేలతో చాలా పటిష్టంగా ఉంది. సొంతగడ్డపై ఆడుతుండటం కూడా విదర్భకు అనుకూలం కానుంది. 

►ఉదయం గం. 9.30 నుంచి  స్టార్‌ స్పోర్ట్స్‌–2లో ప్రత్యక్ష ప్రసారం  

మరిన్ని వార్తలు