నా పంట యాప్‌ రైతుకు చేదోడు!

12 Feb, 2019 00:07 IST|Sakshi

రైతులకు తోడ్పడటానికి తన వంతుగా ఏదో ఒకటి చేయాలన్న తపనతో నవీన్‌ కుమార్‌ అనే యువకుడు ఏడాదిన్నర క్రితం ప్రారంభించిన ప్రస్థానం రైతులకు చేదోడుగా నిలుస్తోంది. సకాలంలో సమాచారం సాంకేతిక సలహా అందక పంట నష్టపోవడం, దళారీ వ్యవస్థ వల్ల పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడం వంటి మౌలిక సమస్యలను పరిష్కరించగలిగితే రైతుల జీవితాల్లో వెలుగులు పూయించవచ్చని నవీన్‌కుమార్‌ తలపెట్టాడు. ఐఐఐటీ హైద్రాబాద్, ఇక్రిశాట్‌ నిపుణుల తోడ్పాటుతో ‘నా పంట’ అనే మొబైల్‌ యాప్‌ను 2017 జూన్‌లో రూపొందించారు. ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్లలోకి గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ‘నా పంట’ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

 3,500 మార్కెట్లలో 300 వ్యవసాయోత్పత్తులకు పలుకుతున్న తాజా ధరవరలతోపాటు మూడేళ్లలో వాటి ధరల్లో హెచ్చుతగ్గులను ఈ యాప్‌ ద్వారా రైతులు తెలుసుకోవచ్చు. ప్రకృతి, సేంద్రియ, రసాయనిక వ్యవసాయం చేసే రైతులకు అవసరమైన 120 పంటలకు సంబంధించిన ఎరువులు, చీడపీడల యాజమాన్య మెలకువలు, కషాయాలకు సంబంధించిన వివరాలను ఇందులో పొందుపరిచారు. పంటల బీమా.. కోల్డ్‌ స్టోరేజ్‌ సదుపాయాలు.. యంత్రపరికరాల లీజు సమాచారం, వ్యవసాయ డీలర్ల వివరాలు.. వంటి మొత్తం 16 రకాల సేవలను స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా నిమిషంలోనే పొందవచ్చని నవీన్‌ వివరించారు.

గ్రామీణ రైతులు ఉపయోగించుకోగలిగేలా తెలుగు భాషలోనే ఆన్‌లైన్‌ మార్కెటింగ్, ఈ కామర్స్‌ సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు. ప్రారంభించిన ఏడాదిన్నర కాలంలోనే ఈ యాప్‌ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో లక్షా పది వేల మంది రైతులు ఇప్పటికే లబ్ధి పొందుతున్నారని నవీన్‌(95059 99907) చెబుతున్నారు. బాల వికాస, రెడ్డీ ల్యాబ్స్‌ వంటి ప్రైవేటు సంస్థలతోపాటు ప్రభుత్వ సంస్థలతోనూ కలిసి పనిచేస్తూ రైతులకు చేరువ అవుతున్నామన్నారు. అనతికాలంలోనే అనేక అవార్డులను అందుకున్న ‘నా పంట’ యాప్‌ను ఉపయోగించుకోగలిగిన రైతులు సాగు వ్యయాన్ని తగ్గించుకోవడానికి, ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు