ఇంకా ధోని గురించి ఎందుకు?

14 Jul, 2019 16:37 IST|Sakshi

న్యూఢిల్లీ:  టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని తన రిటైర్మెంట్‌కు సంబంధించి ఏమైనా ఆలోచన ఉంటే దాన్ని మానుకోవాలని ఇప్పటికే ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ కోరగా, తాజాగా రచయిత జావెద్‌ అక్తర్‌ కూడా దాదాపు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వరల్డ్‌కప్‌ సెమీస్‌లో టీమిండియా ఓటమితో ధోని రిటైర్మెంట్‌ వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ ప్రపంచకప్‌ అనంతరం ధోని రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కోహ్లీసేన సైతం కప్ గెలిచి ధోనికి ఘనంగా వీడ్కోలు పలకాలని భావించింది. అయితే, అనూహ్యంగా సెమీస్‌లోనే భారత్‌ ఇంటిదారి పట్టింది. ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు ధోనికి మద్దతుగా నిలుస్తున్నారు.

‘ ధోని గేమ్‌ను అర్థం చేసుకునే తీరు భారత్‌కు ఎంతో ఉపయోగం. ధోని ఒక నమ్మదగిన ఆటగాడు. భారత క్రికెట్‌ జట్టుకు ధోని ఎంతో విలువైన ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.  ఇంకా అతను ఆడాల్సిన క్రికెట్‌ చాలా ఉంది. ఇంకా ధోని గురించి, అతని రిటైర్మెంట్‌ గురించి మాట్లాడతారెందుకు’ అని జావెద్‌ అక్తర్‌ ప్రశ్నించారు. అంతకుముందు లతా మంగేష్కర్‌  కూడా ధోని రిటైర్మెంట్‌కు సంబంధించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ..‘ధోని జీ. మీరు రిటైర్‌ కాబోతున్నారనే వార్తలు వింటున్నాను. దయచేసి అలాంటి ఆలోచనలు చేయకండి. దేశానికి మీ అవసరం ఎంతో ఉంది. దేశం కోసం మీరు మరేన్నొ మ్యాచ్‌లు ఆడాలి. మీ మనసులోంచి రిటైర్మెంట్‌ ఆలోచనను తీసేయాల్సిందిగా నా విన్నపం’ అని ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు