సెంచరీ కొట్టకపోతే వేస్ట్‌!

22 Jun, 2020 11:38 IST|Sakshi

ఇంగ్లండ్‌లో కనీసం శతకం కొట్టాల్సిందే..

విండీస్‌ ఆల్‌రౌండర్‌ రోస్టన్‌ ఛేజ్‌

సౌతాంప్టాన్‌: త్వరలో ఇంగ్లండ్‌తో ఆరంభమయ్యే ద్వైపాక్షిక సిరీస్‌లో కనీసం సెంచరీ కొట్టాల్సిందేనని  వెస్టిండీస్‌ ఆల్‌ రౌండర్‌ రోస్టన్‌ ఛేజ్‌ పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో బ్యాటింగ్‌పై సీరియస్‌గా దృష్టిపెట్టిన ఛేజ్‌.. ఆ జట్టుపై వారి దేశంలో సెంచరీ చేయాలని తాను ఎప్పుడూ కోరుకుంటానన్నాడు. ఇప్పటివరకూ 32 టెస్టులు ఆడి ఐదు సెంచరీ సాయంతో 1,695 పరుగులు సాధించిన ఛేజ్‌.. ఒక ఉన్నతస్థాయి బ్యాట్స్‌మన్‌గా ఎదగడానికి ఇంగ్లండ్‌తో సిరీస్‌ను ఉపయోగించుకోవాలని చూస్తున్నాడు. ‘ ఇంగ్లండ్‌లో సెంచరీ చేయడమంటే అది కచ్చితంగా ప్రత్యేకంగానే నిలుస్తుంది. దాంతో కనీసం సెంచరీ కొట్టడంపై దృష్టి పెట్టా. ఒకవేళ సెంచరీ చేయకపోతే మాత్రం అది నాలో నిరాశనే మిగులుస్తుంది. ఇంగ్లండ్‌లో ఒక్క సెంచరీ చేస్తే చాలు. ఇక్కడ శతకం సాధిస్తే ఆల్‌ రౌండర్‌గా నాకు మరింత ప్రూవ్‌ చేసుకునే అవకాశం లభిస్తుంది. దాంతో పాటు బ్యాట్స్‌మన్‌గా  రేటింగ్‌ కూడా పెరుగుతుంది. (‘నీకు అబ్బాయిలు ఇష్టమా’ వివాదం ముగిసింది!)

మా మధ్య ఒక మంచి సిరీస్‌ జరుగుతుందని, అందులో నేను బ్యాట్‌తో మెరవాలని కోరుకుంటున్నా. సాధ్యమైనన్ని పరుగులు సాధించడమే నా లక్ష్యం. ప్రస్తుతం మా టాపార్డర్‌ అంత బాలేదు. మా జట్టులోని సభ్యులు 30, అంతకంటే ఎక్కువ టెస్టులు ఆడటంతో వారి అనుభవం పనికొస్తుంది. మేము ఎప్పుడూ మెరుగు పడటంపైనే ఎక్కువగా ఫోకస్‌ చేస్తూ ఉంటాం. ఈ సిరీస్‌లో కరీబియన్‌కు చెందిన జోఫ్రా ఆర్చర్‌తో పోటీ పడాలని విషయాన్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నా’ అని ఛేజ్‌ తెలిపాడు. కొన్ని రోజుల క్రితం ఇంగ్లండ్‌తో సిరీస్‌కు గురించి వెస్టిండీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షెనాల్‌ గాబ్రియెల్ మాట్లాడాడు. ప్రధానంగా గతేడాది కరీబియన్‌ దీవుల్లో జోరూట్‌ను ‘ నీకు అబ్బాయిలు ఇష్టమా’ అని స్లెడ్జింగ్‌ చేసి నిషేధానికి గురైన అంశాన్ని ప్రస్తావించాడు. అది ఒక ముగిసిన అధ్యాయమని, ఆ తరహా కామెంట్లు ఇక చేయదలుచుకోలేదన్నాడు. వ్యక్తిగత పరిహాసంలో భాగంగానే రూట్‌ను ఆ రకంగా స్లెడ్జ్‌ చేసినట్లు తెలిపాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌పై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నాడు. ఒకవేళ తనకు తుది జట్టులో చోటు దక్కితే ఓవరాల్‌గా ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగుతానన్నాడు. జూలై8వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్‌ ఆరంభం కానుంది. తొలి టెస్టుకు సౌతాంప్టాన్‌ వేదిక కానుంది. 

మరిన్ని వార్తలు