ప్రపంచకప్‌: ఆసీస్‌ లక్ష్యం 208

1 Jun, 2019 21:12 IST|Sakshi

బ్రిస్టల్‌: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2019లో భాగంగా ఆస్ట్రేలియాతో జరగుతున్న మ్యాచ్‌లో 208 పరుగుల లక్ష్యాన్ని అఫ్గానిస్తాన్‌ నిర్దేశించింది. ఆసీస్‌ బౌలర్ల విలవిల్లాడిన ఆఫ్గాన్‌ 38.2 ఓవర్లలో 207 పరుగులకే అలౌటైంది. అఫ్గాన్‌ టాపార్డర్‌ పూర్తిగా విఫలమైనప్పటికీ మిడిలార్డర్‌ రాణించింది. అఫ్గాన్‌ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ నజీబుల్లా జద్రాన్‌(51; 49 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్సర్లు) అర్దసెంచరీతో ఆకట్టుకున్నాడు. సారథి గుల్బదిన్‌ నైబ్‌(31) తన వంతు పాత్ర పోషించాడు. చివర్లో రషీద్‌ ఖాన్‌(27), ముజీబ్‌(13)లు మెరుపులు మెరిపించడంతో అఫ్గాన్‌ రెండు వందల స్కోర్‌ దాటింది.

బెంబేలెత్తించిన ఆసీస్‌ బౌలర్లు
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన అఫ్గాన్‌కు ఆదిలోనే కోలుకోలేని షాక్‌ తగిలింది. ఓపెనర్లు షహజాద్‌, హజ్రతుల్లా పరుగులేమి చేయకుండానే వెనుదిరిగారు. దీంతో ఐదు పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో రహ్మత్‌ షా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే అతడికి సహచర బ్యాట్స్‌మన్‌ నుంచి సహకారం అందలేదు. షాహిది(18) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. అనంతరం రహ్మత్‌(43) జంపా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ తరుణంలో ఆదుకుంటాడనుకున్న నబీ(7) అనవసరపు పరుగుకోసం యత్నించి రనౌట్‌ అయ్యాడు. దీంతో 77 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి అఫ్గాన్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. 

77 నుంచి 207కు
అఫ్గాన్‌ కనీసం రెండు వందల స్కోర్‌ దాటిందంటే నజీబుల్లా, గుల్బదిన్‌ పోరాటమే. ముఖ్యంగా నజీబుల్లా అటాకింగ్‌ గేమ్‌ ఆడుతూ స్కోర్‌ బోర్డు పరుగెత్తించాడు. మరోవైపు నజీబుల్లాకు గుల్బదిన్‌ చక్కటి సహకారాన్ని అందించాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 83 పరుగులు భాగస్మామ్యం నమోదు చేశారు అనంతరం ఈ జోడిన ఓకే ఓవర్‌లో స్టోయినిస్‌ ఓట్‌ చేశాడు. అయితే చివర్లో రషీద్‌, ముజీబ్‌లు బ్యాట్‌కు పనిచెప్పడంతో అఫ్గాన్‌ గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది. ఆసీస్‌ బౌలర్లలో కమిన్స్‌, జంపా చెరో మూడు వికెట్లతో రాణించగా.. స్టొయినిస్‌ రెండు వికెట్లు​ పడగొట్టాడు.
 

>
మరిన్ని వార్తలు