వాన లేకపోతే... బోణీ గ్యారంటీ!

15 Jun, 2019 05:56 IST|Sakshi

దక్షిణాఫ్రికా, అఫ్గాన్‌ మ్యాచ్‌ నేడు

ఒక్క మ్యాచ్‌ కూడా నెగ్గని ఇరు జట్లు

సాయంత్రం 6 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌–3లో ప్రత్యక్ష ప్రసారం  

కార్డిఫ్‌: ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు అసలు గెలవలేకపోయిన జట్లు దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్‌. ఎట్టకేలకు ఈ రెండు జట్ల మధ్య పోరు జరుగనుండటంతో ఖాతా తెరిచే అవకాశం వచ్చినట్లయింది. శనివారం వానే లేకపోతే... అట్టడుగు స్థానాల్లో ఉన్న ఈ జట్లలో ఏదో ఒక జట్టు గెలుపుబాట పడుతుంది. ఈ మెగా ఈవెంట్‌ సఫారీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పుడైనా క్వార్టర్సో, సెమీస్‌లోనో దురదృష్టంతో దూరమయ్యే దక్షిణాఫ్రికా ఈసారి ఆరంభం నుంచే కష్టాలు ఎదుర్కొంటుంది. వరుసగా ఇంగ్లండ్, బంగ్లాదేశ్, భారత్‌ చేతిలో ఓడిన సఫారీ జట్టు విండీస్‌తో వర్షం వల్ల ఆడలేకపోయింది. ఆడాల్సిన 9 మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌లు పూర్తయినా గెలవని ఈ జట్టు సెమీస్‌ అవకాశాల్ని దాదాపు కోల్పోయింది.

మరోవైపు క్రికెట్‌ కూన అఫ్గానిస్తాన్‌ కూడా వరుసగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడింది. ఆసీస్, లంక, కివీస్‌లను ఎదుర్కోలేకపోయింది. అయితే దక్షిణాఫ్రికాలాంటి పటిష్ట జట్టును ఓడిస్తుందన్న నమ్మకం లేకపోయినా... రోజు కలిసొస్తే, సఫారీకి దురదృష్టం వెంటాడితే మాత్రం అఫ్గాన్‌ గెలిచే అవకాశాల్ని కొట్టిపారేయలేం. పైగా నిలకడలేని బ్యాటింగ్‌ లైనప్‌ సఫారీని నిండా ముంచుతోంది. ఆమ్లా వరుసగా విఫలమవుతున్నాడు. కెప్టెన్‌ డు ప్లెసిస్, ఓపెనర్, కీపర్‌ డికాక్‌ బాధ్యతను తీసుకుంటే పరుగుల వరద పారించొచ్చు. బౌలింగ్‌లో రబడపైనే జట్టు ఆధారపడింది. మరోవైపు కెప్టెన్‌ గుల్బదిన్‌ నైబ్, హజ్రతుల్లా, ఆల్‌రౌండర్‌ నబీ బ్యాటింగ్‌లో రాణిస్తే దక్షిణాఫ్రికాను ఎదుర్కోవచ్చు. రషీద్‌ ఖాన్, ముజీబ్‌ బౌలింగ్‌లో సత్తాచాటితే... ప్రత్యర్థి ఫామ్‌ దృష్ట్యా అనూహ్య ఫలితాన్ని ఆశించవచ్చు.

మరిన్ని వార్తలు