జీఎం టైటిల్‌కు చేరువలో హర్ష

16 Sep, 2018 04:54 IST|Sakshi

ప్రపంచ అండర్‌–20 చెస్‌ చాంపియన్‌షిప్‌లో తొమ్మిదో స్థానం

ఇస్తాంబుల్‌ (టర్కీ): గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం) హోదా ఖరారు చేసుకోవడానికి తెలంగాణ చెస్‌ ప్లేయర్‌ హర్ష భరతకోటి మరింత చేరువయ్యాడు. ఇప్పటికే మూడు జీఎం నార్మ్‌లు దక్కించుకున్న హర్ష ఎలో రేటింగ్‌ 2500 లేకపోవడంతో జీఎం టైటిల్‌ ఇంకా లభించలేదు. శనివారం ముగిసిన ప్రపంచ అండర్‌–20 చెస్‌ చాంపియన్‌షిప్‌లో 18 ఏళ్ల హర్ష ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత హర్ష 7.5 పాయింట్లతో మరో పది మందితో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా హర్ష తొమ్మిదో స్థానంలో నిలిచాడు.

ఈ మెగా ఈవెంట్‌లో ఆరు గేముల్లో గెలిచిన అతను, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మరో రెండు గేముల్లో ఓడిపోయాడు. ఆరుగురు గ్రాండ్‌మాస్టర్లతో ఆడిన హర్ష... అలెన్‌ పిచోట్‌ (అర్జెంటీనా), సునీల్‌దత్‌ లైనా నారాయణన్‌ (భారత్‌), లియాంగ్‌ అవండర్‌ (అమెరికా)లపై గెలుపొంది... అలెగ్జాండర్‌ డాన్‌చెంకో (జర్మనీ)తో గేమ్‌ను ‘డ్రా’గా ముగిం చాడు. పర్హామ్‌ మగ్‌సూద్‌లు (ఇరాన్‌), ఆమిన్‌ (ఇజ్రాయెల్‌) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఓవరాల్‌గా ఈ ప్రదర్శనతో హర్ష 18 పాయింట్లు సంపాదించి తన ఓవరాల్‌ ఎలో రేటింగ్‌ను 2492కు పెంచుకున్నాడు. తదుపరి టోర్నీల్లో హర్ష మరో ఎనిమిది పాయింట్లు సాధిస్తే అతనికి అధికారికంగా జీఎం టైటిల్‌ ఖాయమవుతుంది. మరోవైపు ప్రపంచ అండర్‌–20 చాంపియన్‌షిప్‌లో భారత్‌కే చెందిన అభిమన్యు పురాణిక్‌ రజత పతకం సాధించాడు. 8.5 పాయింట్లతో అతను రెండో స్థానంలో నిలిచాడు. ఇరాన్‌కు చెందిన పర్హామ్‌ మగ్‌సూద్‌లు 9.5 పాయింట్లతో చాంపియన్‌గా అవతరించాడు.  

మరిన్ని వార్తలు