దీపావళికి రాని ‘స్టార్స్’

29 Oct, 2016 12:12 IST|Sakshi
దీపావళికి రాని ‘స్టార్స్’
నిరాశలో అభిమానులు
 
దీపావళి పండుగ సందడిలో సినిమాలు కూడా ఒక భాగం. సాధారణంగా పండుగ సందర్భాల్లో ప్రముఖ హీరోల చిత్రాలు తెరపైకి వచ్చి ప్రేక్షకులకు ఆనందం కలిగిస్తుంటాయి. అలాంటిది ఈ దీపావళికి విడుదల అవుతాయని ఊహించిన ప్రముఖ హీరోల చిత్రాలు పలు కారణాల వల్ల విడుదల కాకపోవడం వారి అభిమానులకు నిరుత్సాహాన్ని కలిగించిందనే చెప్పాలి. సూపర్‌స్టార్‌ రజనీకాంత్, విశ్వనటుడు కమలహాసన్, ఇళయదళపతి విజయ్, అజిత్‌ ల చిత్రాలు విడుదలవుతాయని భావించిన అభిమానులకు ఈ దీపావళి నిరాశే మిగిల్చింది.
 
చెన్నై:  గత 2013 దీపావళికి నటుడు విజయ్‌ నటించిన తలైవా చిత్రం విడుదలౌతుందని ఆశించినా పలు సమస్యల కారణంగా ఆ చిత్రం దీపావళి తరువాత తెరపైకి వచ్చింది. ఇక 2014లో అదే నటుడు నటించిన కత్తి చిత్రం పలు ఆటంకాలను ఎదుర్కొని ఎట్టకేలకు దీపావళికి తెరపైకి వచ్చి ఆయన అభిమానుల్ని ఖుషీ చేసింది. ఈ సారి విజయాప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న భైరవా చిత్రం దీపావళికి విడుదలవుతుందని ఎదురు చూశారు. అయితే ఇంకా చిత్రీకరణ కార్యక్రమాల్లోనే ఉండడంతో భైరవా చిత్రం విడుదల వాయిదా పడింది. అయితే గుడ్డిలో మెల్ల మాదిరి ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయడంతో ఆయన అభిమానులు సంబరపడిపోతున్నారు. ఇకపోతే గత ఏడాది అజిత్‌ నటించిన వేదాళం విడుదలై ఆయన అభిమానుల్ని సంతృప్తి పరచింది.

ఆ చిత్ర షూటింగ్‌లో గాయాల పాలైన అజిత్‌ కాలుకు శస్త్ర చికిత్స చేయించుకుని మూడు నెలలకు పైగా విశ్రాంతి తీసుకుని తాజా తదుపరి చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం దీపావళికి తెరపైకి వస్తుందని ఆయన అభిమానులు ఆశలు పెంచుకున్నారు. అయితే ఇదీ ఇంకా నిర్మాణంలోనే ఉండడంతో అజిత్‌ చిత్రం ఈ దీపావళి బరిలోకి దిగలేకపోయింది. ఇక సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ లింగా చిత్రం ఆయన అభిమానుల్లో యమ జోష్‌ను నింపినా తాజాగా శంకర్‌ దర్శకత్వంలో నటిస్తున్న 2.ఓ చిత్రం దీపావళి రేసుకు రెడీ అవుతుందని ఆశించారు. చిత్ర దర్శక నిర్మాతలు కూడా అలాంటి ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే 2. ఓ చిత్రం షూటింగ్‌ పూర్తి కాలేదు. దీన్ని వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అదే విధంగా విశ్వనటుడు కమలహాసన్ నటించి చాలా కాలంగా విడుదల వాయిదా పడుతూ వస్తున్న విశ్వరూపం 2 చిత్రం ఈ దీపావళికి విడుదలవుతుందని భావించారు. అయితే ఈ చిత్రానికి ఇంకా మోక్షం కలగలేదు.
 
4 చిత్రాల దీపావళి
 
కాగా ఈ దీపావళికి నాలుగు చిత్రాలు తెరపైకి వచ్చాయి.అందులో ఒకటి కార్తీ నటించిన కాష్మోరా. ఇందులో కార్తీ ద్విపాత్రాభినయం చేశారు. నయనతార, శ్రీదివ్య నాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని గోకుల్‌ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌.ప్రకాశ్, ఎస్‌ఆర్‌.ప్రభులు నిర్మించారు. రెండవది కోడి. నటుడు ధనుష్‌ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ఇది. రాజకీయనేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అందాలతార త్రిష ప్రతినాయకిగా రాజకీయనాయకురాలు నటించడం విశేషం. మరో నాయకిగా అనుపమ పరమేశ్వరన్ నటించారు. ఎస్‌.ఆర్‌.దురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వంలో దర్శకుడు వెట్రిమారన్ తన గ్రాస్‌రూట్‌ పతాకంపై నిర్మించారు. వీటితో పాటు తిరైక్కు వరాద కథై, మాకాపా. ఆనంద్‌ హీరోగా నటించిన కడలై చిత్రాలు తెరపైకి వచ్చాయి.
మరిన్ని వార్తలు