హీరోయిన్‌ లేకుండా కార్తీ కొత్త సినిమా.. అన్న బ్యానర్‌లోనే!

22 Nov, 2023 10:00 IST|Sakshi

ఎవరికైనా జయాపజయాలు సహజం. అపజయాలను విశ్లేషించుకోవాలే గానీ దిగులు పడకూడదని పెద్దలు చెబుతారు. హీరో కార్తీ విషయానికి వస్తే ఇటీవల విరుమాన్‌, సర్ధార్‌, పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రాల వరుస విజయాలతో హ్యాట్రిక్‌ కొట్టారు. కానీ, తాజాగా నటించిన జపాన్‌ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఇది కార్తీ నటించిన 25వ చిత్రం. అయినా దాని గురించి ఆలోచించకుండా తదుపరి చిత్రాలకు సిద్ధం అయిపోయారు.

కార్తీ ఇప్పటికే నలన్‌ కుమారస్వామి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది ఆయన నటిస్తున్న 26వ చిత్రం. ఈ చిత్రం షూటింగ్‌ దశలో ఉండగానే తన 27వ చిత్రానికి రెడీ అయ్యారు. ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు 96 అనే సూపర్‌ హిట్‌ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో నటుడు అరవింద్‌స్వామి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

హీరో సూర్య తన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవలే తమిళనాడులోని కుంభకోణంలో ప్రారంభమైంది. ఇందులో కార్తీకి హీరోయిన్‌ ఉండదట. ఇది కార్తీ, అరవిందస్వామి చుట్టూ సాగే కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. కాగా కార్తీ ఇంతకు ముందు నటించిన ఖైదీ చిత్రంలో కూడా హీరోయిన్‌ లేదన్నది గమనార్హం. ఆ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. దీంతో ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంపై ఇప్పటి నుంచే కార్తీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

చదవండి: త్రిషకు క్షమాపణ చెప్పను.. నేను మాట్లాడితే అగ్నిగోళం బద్దలవుతుంది: మన్సూర్‌

మరిన్ని వార్తలు